ఎలిగేడు: కుటుంబంలో ఆస్తి గొడవలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి కొడుకు(17 నెలలు)ను బావిలో పడేసి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో బాలుడు మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లికి చెందిన కల్వల తిరుపతిరెడ్డి, మానస దంపతులు. వీరికి దేవాన్ష్ (17 నెలలు) సంతానం. తిరుపతిరెడ్డి, అతడి సోదరుడు రత్నాకర్‌రెడ్డి మధ్య కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. మూడునెలల క్రితం పంచాయితీ పెట్టి పెద్దల సమక్షంలో ఆస్తి పంచుకున్నారు. అప్పటి నుంచి తిరుపతిరెడ్డి భార్య, కుమారుడితో కలిసి సుల్తానాబాద్‌లోని ఓ అద్దింట్లో నివాసం ఉంటున్నాడు.
ఆస్తి పంపకాల విషయమై చంపుతామని తరచూ కొందరు బెదిరిస్తున్నారని భార్యతో చెప్పుకుని తిరుపతిరెడ్డి బాధపడేవాడు. ఈ క్రమంలో రాములపల్లిలో ఉంటున్న తల్లిదండ్రులకు తన కుమారుడిని చూపించి తీసుకొస్తానని భార్యతో చెప్పి బయల్దేరాడు. అయితే ఎంతకూ తిరిగి రాకపోవడంతో భర్తకు మానస ఫోన్ చేయగా సమాధానం రాలేదు. వెంటనే అత్తామామలకు ఫోన్ చేయగా రాములపల్లికి రాలేదని వారు చెప్పారు. అనుమానంతో పొలం వద్దకు వెళ్లి చూడగా తిరుపతిరెడ్డి అపస్మారకస్థితిలో కనిపించాడు.
బావిలో బాలుడి చెప్పులు కన్పించాయి. తిరుపతిరెడ్డిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాస్త తేరుకున్నాక దేవాన్ష్ గురించి అడుగగా తానే బావిలో పడేసి గడ్డిమందు తాగానని చెప్పాడు. విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ సీఐ జగదీశ్, జూలపల్లి ఎస్సై వెంకటకృష్ణ బావి వద్దకు చేరుకుని గ్రామస్తుల సహకారంతో దేవాన్ష్ మృతదేహాన్ని బయటకు తీయించారు. మానస ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment