కోల్‌కతా: బెంగాల్‌లో టీఎంసీ నాయకుడిని కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణా జిల్లాలో ఓ టీఎంసీ యువనేతను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన తిటాఘర్‌లోని బీటి రోడ్డులోని సంధ్య సినిమా థియేటర్ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడుని టీఎంసీ యువ నాయకుడు రాణాజయ్ శ్రీవాస్తవగా గుర్తించారు. ఆయన బారక్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో తృణమూల్ హిందీ విభాగంలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా శ్రీవాస్తవను మొదట స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కానీ పరిస్థితి విషమించడంతో కోల్‌కతాలోని మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ హత్య వెనుక బీజేపీ హస్తముందని టీఎంసీ ఆరోపించింది. టీఎంసీ నార్త్ 24 పరగణాల చీఫ్ జ్యోతిప్రియో ముల్లిక్ మాట్లాడుతూ.. "ఈ ప్రాంతంలో అధికార పార్టీ కార్యకర్తలలో భయం కలిగించడానికే దుండగులు దాడికి పాల్పడ్డారు’’ అని ఆరోపించారు. అంతే కాకుండా టిఎంసీ అసెంబ్లీ చీఫ్ విప్, పానిహతి ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ ఈ ఏడాది ఎన్నికలకు ముందు బిజెపి నుంచి రాష్ట్రంలో అధికార పార్టీలో చేరినందున కాషాయ పార్టీ కార్యకర్తలు శ్రీవాస్తవను చంపారని ఆరోపించారు. అయితే ఈ హత్య రాష్ట్రంలో అధికార పార్టీలోని అంతర్గత పోరు కారణంగానే జరిగిందని బీజేపీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment