సాక్షి, తాండూరు: అదృశ్యమైన టీఆర్‌ఎస్ నేత నాగరాజ్‌గౌడ్ గొల్ల చెరువులో శుక్రవారం శవమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడంగల్ నియోజకవర్గంలోని అంగడి రాయిచూర్ గ్రామానికి చెందిన నాగరాజ్‌గౌడ్ 20 ఏళ్ల క్రితం తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసి అక్కడే కుటుంబంతో స్థిరపడ్డాడు. నాగరాజ్‌గౌడ్ కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డాడు. నాటి నుంచి తన వ్యాపారాలను చూసుకుంటున్నాడు.
నాగరాజ్‌గౌడ్ భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉండగానే ఆరేళ్ల క్రితం మరో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యను షాద్‌నగర్‌లో ఉంచి కాపురం పెట్టాడు, వీరికి ఒక కూతురు ఉంది. రెండో భార్యను వ్యాపారాల పేరుతో తరచూ పుణెకు తీసుకెళ్తూ మొదటి భార్య లక్ష్మి వద్దకు రావడం తగ్గించడంతో తరచూ గొడవ పడేవారు. వీరి గొడవలు పలు మార్లు పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. ఈ నెల 12న నాగరాజ్‌గౌడ్ మొదటి భార్య వద్దకు రాగా, అదే రోజు రాత్రి భార్యాపిల్లలతో గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు. శుక్రవారం తాండూరు పట్టణ సమీపంలోకి గొల్ల చెరువులో నాగరాజ్‌గౌడ్ శవమై కనిపించాడు.
12న మిస్సింగ్ కేసు నమోదు..
ఈ నెల 12న తన తండ్రి నాగరాజ్‌గౌడ్ కనిపించడం లేదని కూతురు ప్రియా కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తండ్రి వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తాండూరు రూరల్ ఇన్‌స్పెక్టర్ రంగంలోకి దిగి కేసు విచారణ చేపట్టారు. చెంగోల్ గ్రామానికి వెళ్లి అనుమానితుల వివరాలను సేకరించారు.
భార్యే హంతకురాలు..?
తాండూరు మండలంలోని చెంగోల్ గ్రామంలో నివాసముంటున్న నాగరాజ్‌గౌడ్ మొదటి భార్య లక్ష్మితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. 22వ తేదీ రాత్రి నాగరాజ్‌గౌడ్‌ను హత్య చేసి గొల్ల చెరువులో పాడేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. అనంతరం సీఐ జలంధర్‌రెడ్డి, ఎస్సై ఏడుకొండలు గొల్ల చెరువుకు చేరుకొని నాగరాజ్ మృతదేహాన్ని వెలికి తీయించారు. అయితే ఈ హత్యోదంతంలో ఐదుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని తాండూరు రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment