జమ్మూలో కారు లోయలో పడిన ఘటనలో..
పత్తికొండ (తుగ్గలి)/గిద్దలూరు రూరల్: జమ్మూ కశ్మీర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. కారు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందగా వారిలో వీరిద్దరూ ఉన్నారు. మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా పత్తికొండలో స్థిర నివాసమేర్పరచుకున్న తుగ్గలి మండలం పెండేకల్లుకు చెందిన పాటిల్ ప్రతాపరెడ్డి, అనిత దంపతుల పెద్ద కుమారుడు వెంకట ఆనందరెడ్డి (21), ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన చెందిన ఆర్మీ జవాన్ రమణారెడ్డి కుమార్తె కావ్యారెడ్డి (19) ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.
పంజాబ్‌లోని లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో వీరు బీటెక్ చదువుతున్నారు. అయితే కావ్యారెడ్డి చెల్లెలు మనీషా (19) కూడా అదే కాలేజీలో బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. దీపావళికి వరుస సెలవులు రావడంతో గత నెల 28వ తేదీన జమ్మూ కశ్మీర్‌కు 30 మంది స్నేహితులతో కలిసి ఆరు కార్లలో విహారయాత్రకు వెళ్లారు. 30వ తేదీ తిరుగు ప్రయాణంలో శ్రీనగర్–జమ్మూ నేషనల్ హైవేలో రామబన్ జిల్లా మగర్‌కూట్ వద్ద పర్వతాల మధ్య కారు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఘటనలో ఆనందరెడ్డి, కావ్యారెడ్డి, మరో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
కాగా, కారు లోయలో పడటాన్ని గమనించిన మనీషా వెంటనే డోరు తీసుకుని రోడ్డుపైకి దూకేసింది. దీంతో ఆమె చెయ్యి విరిగి తల పగిలింది. పరిస్థితి కొంత విషమంగా ఉంది. సమాచారం అందుకున్న మృతుల తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనాస్థలానికి బయలుదేరి వెళ్లారు. శనివారం ఉదయం మృతదేహాలు స్వస్థలాలకు చేరుకుంటాయని బంధువులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment