
చింతూరు: మండలంలో వరదల వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నానానికి చెరువుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. చింతూరుకు చెందిన ఎర్రమల్లి రాంబాబు, కల్యాణిల ఇల్లు ముంపునకు గురికావడంతో ఎర్రంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నారు. కుమ్మూరుకు చెందిన కురుసం సత్యం, నాగమణిలు కూడా తమ గ్రామం వరద ముంపులో ఉండడంతో ఎర్రంపేటలోని నాగమణి తల్లి వద్ద ఉంటున్నారు.
ఈ క్రమంలో వీరి పిల్లలైన అక్షిత (8), కురసం దుర్గాభవాని (8)లు ఎర్రంపేటలోని ఎంఈవో కార్యాలయం వెనుక ఉన్న చెరువు వద్దకు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. ఎంతసేపటికీ తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో చెరువు వద్ద గాలించడంతో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన బాలికలు ఇద్దరూ 3వ తరగతి చదువుతున్నారు. సంఘటన స్థలాన్ని చింతూరు సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ యాదగిరి సందర్శించి వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment