చిన్నారుల మృతదేహాలను పరిశీలిస్తున్న సీఐ సూర్యనారాయణ
రేపల్లె: ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులను బాబాయే అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో సంచలనం కలిగించింది. సోమవారం జరిగిన ఈ ఘటన వివరాలను సీఐ సూర్యనారాయణ వెల్లడించారు. వేజండ్లకు చెందిన కొండేటి కోటేశ్వరరావు, ఉమాదేవి బెంగళూరులో ఉంటున్నారు. కోటేశ్వరరావు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. వీరు తమ ఇద్దరు కుమారులు పార్థివ్ సాహసవత్(10), రోహిత్‌తశ్విన్(8)లతో కలిసి ఇటీవల రేపల్లె పట్టణంలోని ఉమాదేవి తల్లి అయిన విజయలక్ష్మి ఇంటికొచ్చారు. ఉమాదేవికి చెల్లి శారదాదేవి, అన్న ఉన్నారు. తండ్రి గతంలోనే చనిపోయారు. శారదాదేవి, ఆమె భర్త కాటూరి శ్రీనివాసరావు కూడా విజయలక్ష్మి ఇంట్లోనే ఉంటున్నారు. శ్రీనివాసరావు గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశాడు.
ఆయనకూ ఇద్దరు కుమారులు. ఇదిలా ఉండగా సమీపంలో ఆడుకుంటున్న పార్థివ్‌సాహసవత్, రోహిత్‌తశ్విన్‌లతో పాటు తన ఇద్దరు కుమారులనూ శ్రీనివాసరావు ఇంట్లోకి తీసుకెళ్లాడు. సాహసవత్, రోహిత్‌తశ్విన్‌లను చెక్క కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. శ్రీనివాసరావు కుమారులు ఈ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పడంతో వెంటనే వారు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారులు మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. తల్లి ఉమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. చిన్నారుల హత్యకు గల కారణాలు తెలియరాలేదని, విచారణలో వెలుగులోకొస్తాయని సీఐ సూర్యనారాయణరావు చెప్పారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన ఇద్దరు పిల్లలు విగత జీవులుగా మారడంతో ఉమాదేవిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment