
నుజ్జునుజ్జయిన ఆటో, చెల్లాచెదురైన వేరుశనగ కాయలు
సాక్షి, నిజామాబాద్(వేల్పూర్): ఆటో, బస్సు ఢీకొన్న ఘటనలో అత్త, అల్లుడు దుర్మరణం చెందారు. ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన వేల్పూర్ మండలం లక్కోర గ్రామం వద్ద 63వ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. వేల్పూర్ ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి కథనం మేరకు.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణానికి చెందిన అత్త పోసాని (60), అల్లుడు తిరుపతయ్య(40) చాలా ఏళ్లుగా పండ్లు, కూరగాయల అమ్మకం వ్యాపారం చేస్తుంటారు.
శనివారం నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌కు వచ్చి పచ్చి వేరుశనగ కాయలు కొనుగోలు చేశారు. వీటిని మెట్‌పల్లికి తీసుకెళ్లేందుకు కమ్మర్‌పల్లి మండలం నాగాపూర్‌కు చెందిన నాందేవ్ ఆటోను కిరాయికి మాట్లాడుకున్నారు. వేరుశనగ సంచులు ఆటోలో వేసుకుని బయల్దేరారు. వారు లక్కోర వద్దకు రాగానే, వరంగల్ నుంచి నిజామాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ (అద్దె) బస్సు ఢీ కొట్టింది. తిరుపతయ్య అక్కడికక్కడే మృతి చెందగా, పోసాని, ఆటో డ్రైవర్ నాందేవ్ తీవ్రంగా గాయపడ్డారు.
చదవండి: (చైన్ స్నాచర్ ఉమేష్ ఖాతిక్ అరెస్ట్.. ఎంత దూరమైనా సరే..)
లక్కోర గ్రామపంచాయతీ ఎదుట ప్రమాదం జరగగా, అక్కడే ఉన్న సర్పంచ్ వంశీ.. క్షతగాత్రులను తన కారులో ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోసాని మార్గమధ్యలో చనిపోగా, నాందేవ్‌ను మెరుగైన చికిత్సకోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తిరుపతయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment