ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్పీగా పని చేసిన ప్రభాకర్‌రావు
ప్రణీత్ పరిచయమైందీ అక్కడే...
టీమ్ మొత్తం గతంలో నల్లగొండలో పని చేసిందే
ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను అదుపులోకి తీసుకున్న సిట్
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ‘సైన్యానికి’, నల్లగొండ జిల్లాకు లింకు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్లు గతంలో ఆ ఉమ్మడి జిల్లాలో పని చేసిన వాళ్లే కావడం గమనార్హం. పోలీసు కస్టడీలో ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును సిట్ అధికారులు మూడో రోజైన మంగళవారమూ బంజారాహిల్స్ ఠాణాలో ప్రశ్నించారు. మరోపక్క ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను సిట్ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
ప్రభాకర్‌రావు 2014కు ముందు ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్స్ చాలా తక్కువ చేశారు. అలాంటి వాటిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్పీ కూడా ఒకటి. ప్రభాకర్‌రావుకు ప్రణీత్ అక్కడే పరిచయమైనట్లు తెలిసింది. అతడితోపాటు ఎస్‌ఐబీ కేంద్రంగా ప్రభాకర్‌రావుకు, కొందరు రాజకీయ నాయకులకు ప్రైవేట్ సైన్యంలా పని చేసిన అనేక మంది అధికారులు ఆయన హయాంలో నల్లగొండ జిల్లాలో పని చేసిన వాళ్లే అని పోలీసులు చెబుతున్నారు. అలా తనకు నమ్మకస్తులుగా మారిన కొందరిని ప్రభాకర్‌రావు ఎస్‌ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ఆ విభాగంలోకి తెచ్చుకున్నారు. వీళ్లందరూ అక్రమ ట్యాపింగ్‌లో కీలక పాత్ర పోషించారని సమాచారం. ఇలాంటి అధికారుల్లో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ప్రస్తుతం వరంగల్ పరిధిలో పని చేస్తున్నారు.
విదేశాల నుంచి సాఫ్ట్‌వేర్లు...
ప్రభాకర్‌రావుతోపాటు ఓ కీలక రాజకీయ నేత ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు అండ్ టీమ్ సర్వీస్ ప్రొవైడర్లతో సంబంధం లేకుండానే అక్రమంగా ట్యాపింగ్ చేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్లను విదేశాల నుంచి ఖరీదు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఎస్‌ఐబీ కార్యాలయంలో ప్రణీత్ ఏర్పాటు చేసుకున్న 17 కంప్యూటర్లలో ఈ సాఫ్ట్‌వేర్లు ఉండొచ్చని, ఆ విషయం బయటకు రాకూడదని సంబంధిత హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసి నగర శివార్లలోని అటవీ ప్రాంతంలో పారేసినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.
ప్రణీత్‌కు ఇన్‌ఫార్మర్‌గా పని చేసి, అతడితో కలిసి బెదిరింపు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మీడియా సంస్థ యజమాని ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రణీత్ ఎస్‌ఐబీ కార్యాలయంలోపాటు సదరు మీడియా సంస్థ ఆఫీస్, వరంగల్, సిరిసిల్లలోనూ కొన్ని కంప్యూటర్లు, సర్వర్లు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ కీలక రాజకీయ నాయకుడి ఆదేశాల మేరకు మరో నేత సహకారంతో ఇవి ఏర్పాటు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇవి ఆయా ప్రాంతాల్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అక్కడ ఉంచి ఏం చేశారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment