ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా | Two Persons Lost Life By Taking Selfie In Nizam Sagar Project | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా

Published Mon, Nov 16 2020 4:49 AM | Last Updated on Mon, Nov 16 2020 12:35 PM

Two Persons Lost Life By Taking Selfie In Nizam Sagar Project - Sakshi

సాక్షి, నిజాంసాగర్‌ (జుక్కల్‌) : దీపావళి నాడు సరదా కోసం నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వచ్చిన ఇద్దరు స్నేహితులు సెల్ఫీ మోజులోపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా కల్హెర్‌ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్‌ మన్నన్, పిట్ల ప్రశాంత్, సయ్యద్‌ సుమేర్, చెగుళ్ల బాలరాజు, కటికె శివ స్నేహితులు. శనివారం కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వచ్చిన వీరు నీటి మడుగుల వద్ద బండరాళ్లపైకి వెళ్లారు. ప్రాజెక్టు వరద గేట్ల నుంచి దిగువకు నీరు జాలు వారుతుండటంతో మడుగుల్లో సెల్ఫీలు దిగుతూ స్నానాలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో మడుగుల లోతు అధికంగా ఉండటంతో శివ, సయ్యద్‌ సుమేర్‌ ఈతరాక నీటమునిగి పోయారు. అనంతరం పోలీ సులు గజ ఈతగాళ్లతో గాలించగా ఇరువురి మృతదేహాలు లభ్యమయ్యాయి.

విహారయాత్రకు వచ్చి...


ఎడపల్లి(బోధన్‌): సెల్ఫీమోజు ముగ్గురు బాలికల ప్రాణాలను బలితీసుకుంది. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్‌ ఉద్యానవనంలోని చెరువులో ఆదివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బోధన్‌ రాకాసిపేటకు చెందిన జుబేరా (10) ఇంటికి నిజామాబాద్‌ నుంచి మీరజ్‌ బేగం(16), హైదరాబాద్‌ నుంచి బషీరా బేగం (16) తమ కుటుంబసభ్యులతో వచ్చారు. ముగ్గురి కుటుంబాలకు చెందిన మొత్తం ఎనిమిది మంది అలీసాగర్‌ ఉద్యానవనానికి విహార యాత్రకు వెళ్లారు. అబ్దుల్‌తో పాటు ఈ ముగ్గురు పిల్లలు స్నానాలు చేయడానికి చెరువులోకి దిగారు. ఈ క్రమంలో సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు లోతైన ప్రదేశంలోకి జారిపోయి నీట మునిగారు. వీరిని గమనించిన కుటుంబ సభ్యులు సహాయం కోసం కేకలు వేయడంతో సమీపంలో ఉన్న బోటింగ్‌ పాయింట్‌ సభ్యుడు నగేష్‌ , చెరువులో చేపలుపడుతున్న జాలరి గంగాధర్‌ నీట మునుగుతున్న యువకుణ్ణి రక్షించగలిగారు. అప్పటికే బాలికలు నీట మునిగి మృతి చెందారు.

పుట్టినరోజు వేడుకల్లో విషాదం
వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం మరికాల గ్రామ సమీపంలోని గోదావరిలో మునిగి నలుగురు యువకులు మృతి చెందారు. వెంకటాపురం మండల పరిధి రంగరాజాపురం కాలనీకి చెందిన శశికుమార్‌ పుట్టినరోజు వేడుక జరుపుకోవడానికి శనివారం గ్రామానికి చెందిన 21 మంది యువకులు పాతమరికాల గ్రామ సమీపంలోని గోదావరి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా 16 మంది సరదాగా నదిలోకి ðదిగారు. కొంతసేపటికి ప్రవాహం పెరగడంతో తుమ్మ కార్తీక్‌ (21), సంఖ్యా శ్రీకాంత్‌ (22), రాయవరపు ప్రకాశ్‌ (22), కోడిరెక్కల అన్వేశ్‌ (21) నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన మిగతా మిత్రులు ఒడ్డుకు వచ్చారు. సాయంకోసం అరుపులు, కేకలు పెట్టడంతో చుట్టు పక్కల రైతులు అక్కడికి చేరుకున్నారు. వారు వచ్చసరికే ఆ నలుగురు పూర్తిగా మునిగిపోయారు. అనంతరం గజ ఈతగాళ్లతో గాలించగా.. శనివారం రాత్రి రెండు, ఆదివారం ఉదయం మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.

చెక్‌డ్యాంలో పడి ఇద్దరి మృతి
న్యాల్‌కల్‌(జహీరాబాద్‌) : ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండల పరిధిలోని రేజింతల్‌లో శనివారం చోటు చేసుకుంది. ఈనెల 13న గ్రామానికి చెందిన ఫకీర్‌ ఇస్మాయిల్‌ కుమారుడు సాజిద్, నాగేందర్‌ కుమారుడు రాకేష్‌ మేకలు మేపడానికి వెళ్లారు. రాత్రి వరకు ఇద్దరూ ఇంటికి తిరిగి రాలేదు. కానీ మేకలు మాత్రం ఇంటికి వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. కాగా 14వ తేదీ ఉదయం గ్రామ శివారులోని చెక్‌డ్యాంలో సాజిద్‌ (14) మృతదేహం కనిపించింది. చెక్‌డ్యాంలో నీళ్లు ఎక్కువ ఉండడం వల్ల రాకేశ్‌ కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు ఆదివారం ఉదయం రాకేష్‌ (18) మృతదేహం లభించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement