బాపట్ల జిల్లా గంగపాలెం, ఏలూరు జిల్లా పుట్రేపులో విషాదం
బల్లికురవ/టి.నరసాపురం: వైఎస్సార్‌సీపీ ఓటమిని తట్టుకోలేక తీవ్ర మనస్తాపంతో ఇద్దరు అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గంగపాలెం గ్రామానికి చెందిన పెయ్యల రామయ్య(64) 4వ తేదీ ఉదయం ఎన్నికల ఫలితాలను టీవీలో చూస్తూ బాధపడ్డాడు. ప్రజలకు ఎంతో మేలు చేసిన వైఎస్సార్‌సీపీని ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా ఓడించారంటూ మనోవ్యథకు గురయ్యాడు.
ఈ క్రమంలో శనివారం రాత్రి గంగపాలెం గ్రామం నుంచి మల్లాయపాలెం వెళ్లే రోడ్డులోæని వ్యవసాయ భూమిలో ఉన్న విద్యుత్ స్తంభానికి తాడుతో ఉరి వేసుకుని ప్రాణాలొదిలాడు. ఆదివారం ఉదయం స్థానికులు గమనించి మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న కటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
అతని భార్య సులోచన మాట్లాడుతూ.. ‘జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు అందడంతో మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓడిపోవడంతో నా భర్త ఎంతో బాధపడ్డాడు. ఆయన్ను ఎంతగానో ఓదార్చాం. కానీ, ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు’ అంటూ విలపించింది. రామయ్య కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు, ఎంపీపీ బడుగు శ్రీలక్ష్మి సురేష్, కొణిదెన సర్పంచ్ కె.లేపాక్షి విష్ణు, పెయ్యల రంగనాథ్, గుంజి ఆంజనేయులు తదితరులు పరామర్శించారు.
అన్యాయం జరిగిందంటూ..
ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం పుట్రేపు గ్రామానికి చెందిన గుర్రం శ్రీనివాస్(24) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వైఎస్సార్‌సీపీ అంటే విపరీతమైన అభిమానం ఉన్న శ్రీనివాస్.. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ మెజార్టీతో గెలిచి.. మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవి చేపడతారని భావించాడు. కానీ అందుకు భిన్నంగా ఫలితాలు రావడంతో శ్రీనివాస్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎక్కడో అన్యాయం జరిగిందంటూ ఆవేదన చెందాడు.
ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతరం కొద్దిసేపటికి ఇంటికి వచి్చన కుటుంబసభ్యులు శ్రీనివాస్‌ను వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న శ్రీనివాస్ మరణించడంతో భార్య, ముగ్గురు పిల్లలు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment