
ఢిల్లీ : ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసిన మహిళను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మొదట ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించినా పోలీసుల విచారణలో ఆమె నిజం ఒప్పేసుకుంది. వివరాల ప్రకారం..ఢిల్లీకి చెందిన ప్రియాంక (30) అనే మహిళ వివాహేతర సంబంధం నడుపుతూ కట్టుకున్న భర్తనే కడతేర్చి ఏమీ ఎరగనట్లు హాస్పిటల్‌లో ఆత్మహత్య కథ అల్లేయాలనుకుంది. కానీ డాక్టర్లకు అనుమానం వచ్చి విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో ఆమె రట్టు బయటపడింది. ప్రియాంకకు ఆమె భర్తకు మధ్య 20 సంవత్సరాల వ్యత్యాసం ఉండటంతో తాను సంతోషంగా లేనని, ఇప్పటివరకు తమకు పిల్లలు పుట్టలేదని తెలిపింది. తన వివాహం పట్ల ఏమాత్రం సంతోషంగా లేనని, అందుకే ప్రియుడు వీరు బుర్మా, అతని సోదరుడు కరణ్‌లతో కలిసి పథకం ప్రకారం భర్తను హత్య చేశానని పోలీసులకు తెలిపింది.
ఆస్తి కూడా లాగేసుకోవాలని ప్లాన్
ప్రియాంక గతకాలంగా బర్మా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. దీంతో ఎలాగైనా భర్తను హత్య చేయాలని పథకం రచించారు. ఆగస్టు 18న విషం కలిపిన ఆహారం ఇవ్వడంతో ప్రియాంక భర్త స్పృహ కోల్పోయాడు. దీంతో కరణ్, బర్మాల సహాయంతో భర్త గొంతు నులిపి చంపేసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు స్థానిక బుద్ విహార్ లోని బ్రహ్మశక్తి ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నాడని మొసలి కన్నీళ్లు పెట్టుకుంది. అయితే బాధితుడి గొంతుపై గుర్తులు ఉండటంతో అనుమానం వచ్చిన వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో ప్రియాంక గుట్టు బయటపడటంతో వెంటనే ఆమెను, కరణ్‌లను అరెస్టు చేయగా, ఆమె ప్రియుడు బర్మా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ప్రియాంక భర్త ఢిల్లీలోని మాయపురి ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి ఆస్తిని కూడా తనపై బదిలీ చేయుంచుకోవాలని చూసినట్లు విచారణలో ప్రియంక అంగీకరించింది. ఆమె తరుచూ భర్తతో గొడవపడుతూ ఉండేదని కానీ ఇంత ఘాతుకానికి పాల్పడుతుందని ఊహించలేదని ప్రియాంక అత్తమామలు వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment