సాక్షి, సిద్దిపేట/సిద్దిపేట కమాన్: సిద్దిపేట పట్టణంలో సోమవారం మధ్యాహ్నం కాల్పుల కలకలం చెలరేగింది. నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు సినీ ఫక్కీలో ఓ కారు డ్రైవర్‌పై కాల్పులు జరిపి అందులోని రూ. 43.5 లక్షలను దోచుకెళ్లారు. ఈ సమాచారం అందుకొని వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... గాయపడిన డ్రైవర్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్నారు. ఈ ఉదంతంపై బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకొనేందుకు జిల్లావ్యాప్తంగా 15 బృందాలను రంగంలోకి దించారు.
సిద్దిపేట పట్టణంలోని అన్ని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తామని ఘటనాస్థలిని పరిశీలించేందుకు వచ్చిన పోలీసు కమిషనర్ శ్వేత తెలిపారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డులో నివసించే చేర్యాల మండలం దొమ్మాట మాజీ సర్పంచ్ వకులా భరణం నర్సయ్య టీచర్స్ కాలనీలోని తన 176 గజాల స్థలాన్ని సిద్దిపేటలోని హనుమాన్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కన్నయ్యగారి శ్రీధర్‌రెడ్డికి విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. గజం భూమి రూ. 36,500 చొప్పున 176 గజాలకు రూ.64.24 లక్షలు చెల్లించేందుకు శ్రీధర్ రెడ్డి అంగీకరించి గతేడాది డిసెంబర్ 19న రూ. 16.06 లక్షలను అడ్వాన్స్‌గా చెల్లించాడు.
సోమవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా సిద్దిపేట అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో డాక్యుమెంట్ రైటర్ దగ్గరకు వారిద్దరూ వచ్చారు. ఆ స్థలానికి వీధిపోటు ఉండటంతో కొంత ధర తగ్గించాలని నర్సయ్యను శ్రీధర్‌రెడ్డి కోరగా ఆయన అగ్రిమెంట్ ధరకంటే రూ. 1.29 లక్షలు తగ్గించాడు. దీంతో రూ. 48.18 లక్షల తుది చెల్లింపులో భాగంగా సోమవారం రూ. 43.50 లక్షల నగదు, మరో రూ 1.76 లక్షలకు చెక్కు ఇచ్చాడు. మిగితా రూ. 1.63 లక్షలను సాయంత్రం ఇస్తానని శ్రీధర్ రెడ్డి చెప్పారు. డబ్బు తీసుకున్న నర్సయ్య ఆ బ్యాగును తన కారు (టీఎస్15ఈఈ7127) డ్రైవర్ రంగు పరుశరాములుకు ఇచ్చాడు. ఆపై మధ్యా హ్నం 12:40 గంటలకు రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి వెళ్లి మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రక్రియ పూర్తిచేసుకున్నారు.
అరగంటపాటు దుండగుల రెక్కీ...
కొనుగోలుదారుడైన శ్రీధర్‌రెడ్డి రూ. 43.5 లక్షలను నర్సయ్య డబ్బులు చెల్లించడం, ఆయన ఆ సొమ్మును ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా లెక్కించి ఎర్రటి రంగు ఉన్న బ్యాగులో పెట్టి డ్రైవర్‌కు అప్పగించడాన్ని ఇద్దరు దుండగులు చూస్తూ అరగంటకుపైగా అక్కడే రెక్కీ నిర్వహించారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆపై మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో ఇన్నోవా కారు దగ్గరికి ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చారు. కారు డ్రైవర్‌ను తలుపు తీయాలని 9 ఎంఎం పిస్టల్‌తో ఓ దుండగుడు బెదిరించగా డ్రైవర్ అప్ర మత్తమై వాహనాన్ని స్టార్ట్ చేసి నడిపే ప్రయత్నం చేశాడు.
ఆ సమయంలో దుండగుడు గన్‌ను రివర్స్‌లో పెట్టి కారు అద్దాన్ని పగలగొట్టాడు. నుదిటిపై గన్ పెట్టడంతో డ్రైవర్, దుండగుడు మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో కాల్పులు జరగడంతో డ్రైవర్ ఎడమ తోడలోకి బుల్లెట్ దూసుకెళ్లి బయటకు వచ్చింది. ఆ సమయంలో పిస్టల్ కారులోనే పడిపోయింది. ఈ క్రమంలో వాహనం ఎడమ పక్కన నుంచి మరో దుండగుడు డోర్ తీసి ముందు సీట్లో ఉన్న డబ్బుల బ్యాగు తీసుకున్నాడు. అనం తరం ఇద్దరూ బైక్‌పై పరారయ్యారు. గాయపడ్డ డ్రైవర్ తన యజమానికి సమాచారం అందించేందుకు కారు దిగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వైపు పరుగెత్తాడు.
తుపాకీని తీసేందుకు 3 గంటల నిరీక్షణ!
కారులో దుండగులు వదిలేసిన పిస్టల్‌ను బయటకు తీసేందుకు మూడున్నర గంటలకుపైగా సమయం పట్టింది. తుపాకీ అన్‌లాక్ అయి ఉండటం, పైగా డ్రైవర్ సీటుకు, డోర్‌కు మధ్య అది ఇరుక్కుపోవడంతో దాన్ని తీసే క్రమంలో ఫైరింగ్ జరగొచ్చని భావించిన పోలీసులు నిపుణులు వచ్చే వరకు వేచిచూశారు. అనంతరం సీపీ సమక్షంలో గన్‌ను దస్తావేజులు రూపొందించే గదిలోకి నిపుణుడైన శేఖర్ తీసుకెళ్లి దాన్ని లాక్‌చేసి సీజ్ చేశారు. క్లూస్ టీం సభ్యులు తుపాకీపై వేలిముద్రలతోపాటు రక్తపు మరకలను సేకరించారు. మాఫియా ముఠాలు వాడే తుపాకీలా అది ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆవరణలో ఉన్న వారు చెబుతుండగా ఒక తూటా క్యాప్ మాత్రమే పోలీసులకు లభ్యమైంది. దీంతో దుండగుడు ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపాడనే దానిపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొనుగోలుదారుడిపైనే అనుమానం: నర్సయ్య
తన సొమ్ము చోరీ ఘటన విషయంలో ప్లాట్ కొనుగోలు చేసిన శ్రీధర్‌రెడ్డిపైనే తనకు అనుమానం ఉందని స్థలం విక్రేత నర్సయ్య మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు.
నేను తప్పు చేయలేదు: శ్రీధర్‌రెడ్డి
ప్రభుత్వ ఉపాధ్యాయుడినైన తాను ఎలాంటి తప్పూ చేయలేదని స్థలం కొనుగోలుదారుడు శ్రీధర్‌రెడ్డి వివరించాడు. నిజం నిలకడ మీద తెలుస్తుందని.. పోలీసుల విచారణకు సహకరిస్తానని పేర్కొన్నాడు.
గతంలోనే గొడవలు...
క్రయవిక్రయదారుల మధ్య అగ్రిమెంట్ కుదిరినప్పటి నుంచి సెట్ బ్యాక్, వీధిపోటు విషయమై గొడవలు జరిగాయి. అయితే పెద్ద మనుషులు సర్దిచెప్పడంతో వారు సోమవారం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఘటన జరిగిన అనంతరం విక్రయించిన వ్యక్తి నర్పయ్య మీడియాతో మాట్లాడుతూ ప్లాట్ విషయం గతంలో గొడవ జరిగిందన్నారు.
ఎప్పుడు...సోమవారం మధ్యాహ్నం 12:40 గం. ఏం జరిగింది?
176 గజాల స్థలానికి సిద్దిపేట అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద క్రయవిక్రయదారుల మధ్య ఒప్పందం కుదిరింది. రూ.43.50 లక్షల నగదును విక్రేత తన కారులో ఉన్న డ్రైవర్‌కు ఇచ్చాడు. మధ్యాహ్నం 1:05గం.కు రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి.
ఎలా జరిగింది?
మధ్యాహ్నం 1:10 గంటలకు కారు దగ్గరికి నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్‌పై ఇద్దరు గుర్తుతెలియని దుండగులు వచ్చారు. కారు డ్రైవర్‌ను తుపాకీతో బెదిరించి కిటికీ అద్దం తెరవాలని బెదిరించారు. మాటవినకపోవడంతో అద్దం పగలగొట్టి డ్రైవర్‌పై దాడికి ఓ దుండగుడు యత్నించాడు. పెనుగులాటలో కారు డ్రైవర్ తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. డబ్బు సంచి తీసుకొని దుండగులు పరారయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment