సత్తుపల్లి: అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మనోవేదనతో ఆదివారం కొడుకు సమాధి వద్దే చెట్టుకు ఉరివేసుకుని ఊపిరి తీసుకున్నాడు. హృదయవిదారకమైన ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటుచేసుకుంది. రెండ్రోజుల వ్యవధిలో కొడుకు, తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
పట్టణంలోని వేంసూరు రోడ్‌కు చెందిన చల్లా రాంబాబు(45), కృష్ణవేణి దంపతుల కు భానుప్రకాష్ (16), కుసుమ సంతానం. పిల్లలను చదివించేందుకు ఖమ్మంలోని ఓ నర్సరీలో పనిచేస్తూ అక్కడే పదేళ్లుగా ఉంటున్నారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం మేరకు.. భానుప్రకాష్ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 14న భానుప్రకాష్ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఆ సందర్భంగా ఓ స్నేహితురాలితో చనువుగా ప్రవర్తించాడని తెలిసి పాఠశాల ప్రిన్సిపాల్ మందలించారు. అదేరోజు పరీక్షకు హాజరైన భానుప్రకాష్ పరీక్ష పత్రాలు లాగేసుకొని, వారంపాటు పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. మీ నాన్న ఫీజు కూడా సరిగా కట్టడంటూ స్నేహితుల ముందే టీచర్ కొట్టిందని తల్లి కృష్ణవేణి కన్నీరుమున్నీరైంది. మనస్తాపానికి గురైన భానుప్రకాష్ ఈ నెల 15న ఇంట్లో ఉన్న పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ 17న మృతి చెందాడు. మృతదేహాన్ని సత్తుపల్లి శ్మశానవాటికలో ఖననం చేశారు.
కొడుకు సమాధి వద్దే..:
కొడుకు మృతిని జీర్ణించుకోలేని రాంబాబు కలత చెందాడు. కొడుకు అంత్యక్రియల తర్వాత తానూ చనిపోతానని భోరున విలపించాడు. రాంబాబును సత్తుపల్లిలో ఉంటున్న అతని సోదరుడు ఇంటికి తీసుకెళ్లాడు. అర్ధరాత్రి 12.30 సమయంలో రాంబాబు ఎంత వారించినా వినకుండా ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవటంతో కుటుంబసభ్యులు గాలించగా, ఆదివారం తెల్లవారుజామున కొడుకు సమాధి వద్ద ఉన్న చెట్టుకు వెంటతెచ్చుకున్న దుప్పటితో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ సుబ్బారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment