సాక్షి, సిటీబ్యూరో: దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, సైబర్ క్రైమ్‌కు పాల్పడి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన పాకిస్థానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ ఇంకొన్నాళ్లు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. కేసులో అభియోగపత్రం దాఖలై, విచారణ ప్రారంభమైనా... కోవిడ్ ప్రభావంతో దానికి బ్రేక్ పడింది. దీంతో మళ్లీ ట్రయల్ మొదలై, ముగిసే వరకు డిపోర్టేషన్ ప్రక్రియ ఆగాల్సి వచ్చింది.
‘ఆమె’ కోసం వచ్చి బుక్కయ్యాడు...
నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయారు. సదరు మహిళకు ఇద్ద రు కుమార్తెలు. పన్నెండేళ్ల క్రితం బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఆమెకు అక్కడ పాకిస్థానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ అబ్బాస్ ఇక్రమ్‌తో పరిచయమైంది. తాను భారతీయుడినే అని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించిన అతగాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిన సదరు మహిళ హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. 2011లో ఉస్మాన్ సైతం అక్రమం మార్గంలో హైదరాబాద్‌కు వచ్చాడు.
సైబర్ క్రైమ్‌కు పాల్పడి అరెస్టు...
ఇక్రమ్ వచ్చిన ఆరు నెలలకు ఇతగాడు అక్రమంగా దేశంలోకి వచ్చాడని తెలుసుకున్న సదరు మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించారు. దీంతో కక్షగట్టిన ఇక్రమ్ ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు చిత్రీకరించడంతో పాటు కొందరికి ఆన్‌లైన్‌లో విక్రయించానంటూ బెదిరింపులకు దిగాడు. తనకు డబ్బు ఇవ్వకపోతే సదరు ఫొటోలను బయటపెడతానని బాధిత మహిళ స్నేహితురాలికీ వాట్సాప్ సందేశం పంపాడు. అతడి వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన అధికారులు 2018 జూన్‌లో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అబ్బాస్ పేరుతో అనేక బోగస్ ధ్రువీకరణలు పొంది పాస్‌పోర్ట్ తీసుకున్నాడని, అలాగే కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చేశాడని బయటపడింది.
ధ్రువీకరించిన పాక్ ఎంబసీ ఆఫీస్..
ఇతగాడిని అరెస్టు చేసినప్పుడు మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో టెన్త్ నుంచి డిగ్రీ (2003–08) వరకు చదివినట్లు ఉన్న సర్టిఫికెట్లతో పాటు అబ్బాస్ పేరుతో గోల్నాక చిరునామాతో 2012లో తీసుకున్న భారత పాస్‌పోర్ట్, ఆధార్ సహా ఇతర గుర్తింపు కార్డులతో పాటు పాక్ పాస్‌పోర్ట్‌నకు చెందినదిగా అనుమానిస్తున్న ఓ పేజీ జిరాక్సు ప్రతిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతడివద్ద ఉన్నవి బోగస్ పత్రాలని, వాస్తవానికి పాక్ జాతీయుడని నిర్థారించడం కోసం సైబర్ క్రైమ్ పోలీసులు విదేశీ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ద్వారా ఎంఈఏ పాక్‌కు లేఖ రాశారు. ఆ దేశ రాయ బార కార్యాలయం అతడు తమ జాతీయుడేనంటూ సమాధానం ఇచ్చింది.
కోవిడ్‌తో ఆగిన ట్రయల్...
దీన్ని ఆధారంగా చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఇక్రమ్‌పై అభియోగపత్రాలు దాఖలు చేశారు. సాధారణంగా నేరం చేసిన వాళ్లను జైలుకు పంపి, నిరూపితం కాని వారిని బయటకు వదిలేస్తారు. అయితే ఇక్రమ్ కేసులో మాత్రం ఈ విధానం చిత్రంగా ఉంది. అతడు దోషిగా తేలినా, నిర్దోషిగా బయటపడినా తక్షణం ఆ దేశానికి పంపేయాల్సిందే. ఎంఈఏ నుంచి ఈ మేరకు అందిన ఉత్తర్వుల మేరకు కోర్టులో కేసు డిస్పోజ్ అయిన వెంటనే అతడిని తీసుకువెళ్లి ఢిల్లీలోని పాక్ ఎంబసీలో అప్పగించాలని యోచించారు. అయితే ఈ ఏడాది మార్చి నుంచి కోవిడ్ ప్రభావం, లాక్‌డౌన్ తదితరాల నేపథ్యంలో కేసు ట్రయల్ ఆగిపోయింది. ఫలింతంగా ఇక్కమ్ రిమాండ్ ఖైదీగా జైల్లోనే ఉండిపోయాడు. కోర్టులు పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభమై, కేసు విచారణ ముగిసే వరకు ఇక్రమ్ ఇక్కడ ఉండాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment