సాక్షి, విజయవాడ: బెజవాడలో కలకలం రేపిన దివ్య తేజస్విని హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. దివ్యతో తనకు పెళ్లి జరిగినట్లు నిందితుడు నాగేంద్ర అలియాస్ చిన్నస్వామి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. మంగళగిరిలో తామిద్దరం పెళ్లి చేసుకున్నామని, ఆమె తండ్రి వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని ఆరోపిస్తూ స్పృహ కోల్పోయాడు. దీంతో స్కానింగ్ ప్రక్రియ పూర్తయ్యాక నిందితుడి స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. (చదవండి: గంజాయి తాగుతాడు, పనికిరాని వాడు: దివ్య తల్లి)
మరోవైపు.. నాగేంద్ర చెబుతున్నవన్నీ అసత్యాలని, ఇంజనీరింగ్ చదువుతున్న తమ కూతురు అలాంటి పనికిరాని వాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుందని దివ్య తల్లి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. దివ్య తేజస్విని హత్య కేసులో మాచవరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సెక్షన్ 449, 302 , ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. (చదవండి: బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది)
ఎవరికీ చెప్పలేదని చెప్పాడు: నాగరాజు
గుంటూరు: దివ్య తేజస్వినిని పెళ్లి చేసుకున్నట్లు నాగేంద్ర తనకు చెప్పాడని అతడి సోదరుడు నాగరాజు మీడియాకు తెలిపాడు. ఈ విషయం గురించి రాత్రి దివ్య ఇంటికి వెళ్లి ఆమె తండ్రితో మాట్లాడానని, ఆయన ఇందుకు ఒప్పుకోలేదని తనతో చెప్పినట్లు పేర్కొన్నాడు. బెజవాడలో గురువారం చోటుచేసుకున్న దివ్య హత్యోదంతం గురించి నాగరాజు మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటన జరగగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. నాగేంద్ర కోసుకున్నాడు అని చెప్పారు. నేను పని దగ్గర నుంచి డైరెక్ట్‌గా ఈఎస్‌ఐ ఆస్పత్రికి వచ్చాను. అక్కడే నా సోదరుడితో మాట్లాడాను. దివ్య, తాను ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకున్నామని నాగేంద్ర చెప్పాడు. అంతేకాదు ఈ విషయం గురించి ఎవరికీ చెప్పలేదు అని కూడా అన్నాడు. ఏం జరిగిందో క్లారిటీ లేదు. జరిగిన విషయాన్ని కరెక్టుగా చెప్పలేదు. పెళ్లి చేసుకున్న అని మాత్రం చెప్పాడు’’ అని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment