‘‘అడిగినంత కట్టకపోతే విద్యార్థుల పేర్లను బ్లాక్ లిస్టులో చేర్చుతాం.. కంప్లయింట్ చేస్తారా?.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి’’.. వికారాబాద్ జిల్లా తాండూరులో నారాయణ స్కూల్ యాజమాన్యం తీరు ఇది. అధిక ఫీజులతో వేధింపులకు పాల్పడుతుండడం తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగు చూసింది. దీంతో విద్యాశాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సదరు నారాయణ స్కూల్ యాజమాన్యం నిబంధనల్ని తుంగలో తొక్కి వ్యవహరిస్తున్న తీరూ బయటపడింది.
ప్రభుత్వం ఎన్ని నిబంధనలు అమలు చేసినా ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై నిబంధనలు ఉన్నా పాఠశాల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. వికారాబాద్ జిల్లా తాండూరులో నారాయణ పాఠశాల యాజమాన్యం బరితెగింపునకు దిగింది. ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై వేధింపులకు గురిచేస్తుంది. నిబంధనలుకు విరుద్ధంగా ఫీజులు కట్టాలని ఒత్తిడికి పాల్పడుతుంది. ఫీజులు కట్టక పోతే విద్యార్థుల పేర్లను బ్లాక్ లిస్టులో పెడతామని తల్లిదండ్రులపై బెదిరింపులకు పాల్పడుతోంది. తల్లిదండ్రులు ప్రశ్నిస్తే.. ఎవరికి ఫిర్యాదు చేస్తారో చేసుకోండి.. అధికారులు మమల్ని ఏమీ చేయలేరంటూ జులుం ప్రదర్శిస్తోంది.
పాఠశాల యాజమాన్యం తీరుపై విసుగెత్తిపోయిన తల్లిదండ్రులు వికారాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసి మరీ.. పిల్లలకు అంగీకరించిన ఫీజుల కంటే ఎక్కువ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు వాళ్లు. తల్లిదండ్రులు కట్టమని చెబితే.. దుర్భాషలాడుతున్నారని, పిల్లల విద్యాసంవత్సరం నష్టపోయేలా చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫీజుల విషయంలో నిబంధనలు పాటించని నారాయణ స్కూల్ పిన్సిపాల్. యాజమాన్యంపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు.. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటికే స్కూల్‌కు అపాలజీ నోటీసు ఇవ్వడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ స్కూల్‌కు ఏడవ తరగతి వరకే అనుమతి ఉండగా.. పదో తరగతి వరకు తరగతులు నిర్వహిస్తోంది. ఈ విషయంపై అధికారులు స్పందన దాటవేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment