నీళ్లు మొత్తం తోడాక బావిలో గాలిస్తున్న సిబ్బంది
సాక్షి, వరంగల్ రూరల్: బావిలో జీపు బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ ఒక్కడే మృతి చెందడంతో ఉత్కంఠ వీడింది. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల వద్ద మంగళవారం సాయంత్రం బావిలో జీపు బోల్తా పడగా, అప్పటి నుంచి బుధవారం ఉదయం వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అధికార యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికుల సహాయంతో రాత్రంతా ఆపరేషన్ కొనసాగించారు. జీపులో మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నారని, 11 మంది బతికి బయట పడ్డారని, డ్రైవర్‌తో పాటు మరో నలుగురు జలసమాధి అయ్యారని ప్రచారం జరిగింది. తొలుత డ్రైవర్ సతీష్ మృతదేహం బయటపడింది. దీంతో మరో ముగ్గురి మృతదేహాలు బావిలో ఉంటాయని భావించారు. ఈ మేరకు తెల్లవారుజాము వరకు నీరంతా తోడారు. మృతదేహాలు లభించకపోవడంతో డ్రైవర్ ఒకరే మృతి చెందాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. డ్రైవర్ సతీష్‌కు ఫిట్స్ రావడమే ఘటనకు కారణమని భావిస్తుండగా, పోస్టుమార్టం నివేదిక అందితే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.
(చదవండి : బావిలో పడిన జీపు నలుగురి జలసమాధి)
మంత్రి ఎర్రబెల్లి ఆరా
జీపు బోల్తా పడినప్పటి నుంచి తెల్లవారే వరకు జరుగుతున్న సహాయక చర్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గంటగంటకూ స్థానిక ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా సహాయక చర్యలు అవసరం ఉన్నాయా అని తెలుసుకున్నారు.
పోలీసు యంత్రాంగం సేవలు భేష్
గవిచర్లలో వ్యవసాయబావిలో జీపు పడిన వెంటనే స్పందించిన పోలీసులను డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. రాత్రంతా నిద్రాహారాలు మాని సహాయక చర్యలు చేపట్టడంపై ఆయన పర్వతగిరి సీఐ కిషన్‌తో పాటుగా ఇతర పోలీసు అధికారులు, సిబ్బందిని ఫోన్‌లో అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment