సాక్షి,కైకలూరు(పశ్చిమ గోదావరి): ప్రజలను రక్షించాల్సిన ఆ కానిస్టేబుల్ చైన్ స్నాచర్ అవతారమెత్తాడు. కైకలూరులో మహిళ మెడలో గొలుసు తెంచి పారిపోతుండగా అతన్ని పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీసు స్టేషన్‌లో సింగిడి సత్యనారాయణ 2008 నుంచి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతని సొంతూరు గణపవరం సమీపంలోని అప్పనపేట. సత్యనారాయణ ఇటీవల క్రికెట్ బెట్టింగులు, ఆన్‌లైన్ పేకాటలో అప్పుల పాలయ్యాడు. సత్యనారాయణ వాలీబాల్ ఆడుతుంటాడు. ఈ క్రమంలో ఉండి సమీపంలోని ఉప్పులూరుకు చెందిన బుద్దాల సుభాష్(21)తో పరిచయమైంది.
ఇద్దరూ కలిసి మంగళవారం రాత్రి కైకలూరుకు కేటీఎం స్పోర్ట్స్ మోటారు బైక్‌పై వచ్చారు. సంతమార్కెట్ వద్ద గూడూరి వెంకట వరప్రసాద్ పచారీ దుకాణానికి వెళ్లారు. అతను కౌంటర్‌లో ఉండగా భార్య లోపల సరుకుల వద్ద ఉంది. సత్యనారాయణ జీడిపప్పు కావాలని ఆమెను అడిగాడు. ఆమె వెనక్కి తిరగగానే మెడలో 4 కాసుల బంగారు గొలుసు తెంచుకుని బయటకు వచ్చాడు. అప్పటికే బైక్‌పై సిద్ధంగా ఉన్న సుభాష్‌తో కలిసి ఏలూరురోడ్ వైపు పరారయ్యాడు. ప్రజలు వెంబడించగా సత్యనారాయణ తప్పించుకున్నాడు. సుభాష్ దొరకగా.. కైకలూరు స్టేషన్‌కు తరలించారు. అతని చెప్పిన సమాచారంతో సత్యనారాయణను ఆటపాకలో బుధవారం అరెస్టు చేశారు. అతని నుంచి రూ.1,20,000 విలువ చేసే గొలుసు, చాకు, పెప్పర్ స్ప్రే బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కైకలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment