
శ్రీకాకుళం: మండలంలోని లోలుగు–చిలకపాలెం రహదారిలో ఆప్కో కంపెనీ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఓ మహిళ మరణానికి కారణమయ్యాయి. రాజాం మండలంలోని రాజయ్యపేట గ్రామానికి చెందిన దంపతులు సింగుపురం వెళ్తుండగా నందివాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కోరాడ సునీత(35) దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. రాజాం మండలంలోని రాజయ్యపేట గ్రామానికి చెందిన దంపతులు కోరాడ సత్యనారాయణ, కోరాడ సునీతలు ఆదివారం సింగుపురంలోని బంధువులను పరామర్శించేందుకు బైక్‌పై బయల్దేరారు.
నందివాడ సమీపంలోని ఆప్కో కంపెనీ సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద బండి అదుపు తప్పడంతో వెనుక కూర్చున్న సునీత ఎగిరి కిందపడ్డారు. తలకు గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. కళ్ల ఎదుటే భార్య మృతి చెందడంతో సత్యనారాయణ కన్నీరుమున్నీరయ్యారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. హెచ్‌సీ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ దంపతులకు 13 ఏళ్ల కుమార్తె ఉంది. వీరు ఎప్పుడూ రాపాక–కింతలి రహదారి మీదుగా సింగుపురం వెళ్లేవారని, ఆదివారం మాత్రం పొందూరు–చిలకపాలెం మీదుగా వెళ్లారని ఇంతలోనే ఈ ప్రమాదం సంభవించిందని వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment