రణస్థలం: కలకాలం కలిసి బతుకుదామని పెళ్లి చేసుకున్నారు. ఇంతలో ఊహించని రీతిలో ఇద్దరూ ఒకేరోజు మృతిచెందారు. ఈ విషాద ఘటన రణస్థలం మండలం వేల్పురాయి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. జె.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలి వెంకటరావు (55) మొదటి భార్య చనిపోవడంతో ఈ ఏడాది జూన్ 13న విజయనగరంలోని అయ్యన్నపేటకు చెందిన కర్రోతు పార్వతి (48)ని రెండో వివాహం చేసుకున్నాడు.
ఆషాఢానికి వెళ్లిన పార్వతి ఇటీవలే వేల్పురాయి గ్రామానికి వచ్చింది. ఇంతలో ఏమైందో తెలియదు గానీ వేరే ఇంట్లో పడుకున్న వెంకటరావు మొదటి భార్య కుమారుడు ఝాన్సీ రామానాయుడు శనివారం ఉదయం సొంతింటికి వచ్చి చూసేసరికి పార్వతి రక్తపుమడుగులో శవమై కనిపించింది. వెంటనే చుట్టుపక్కల వారు, బంధువులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పార్వతి సోదరుడు కర్రోతు పైడిరాజు, వేల్పురాయి వచ్చి మృతదేహాన్ని పరిశీలించాడు. తన సోదరిని బావ (బాలి వెంకటరావు) పారతో తలపై బలంగా కొట్టడం వల్లే చనిపోయిందని జె.ఆర్.పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భర్తను వెంటాడిన మృత్యువు
భార్య పార్వతి మృతి చెందిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే అక్కడికి కొద్దిదూరంలో పైడిభీమవరంలో రోడ్డు ప్రమాదం జరిగి బాలి వెంకటరావు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వెంటనే కుమారుడు ఝాన్సీ రామానాయుడు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాడు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వస్తున్న లారీ ద్విచక్రవాహనంపై ఎదురుగా వెళ్తున్న తండ్రి వెంకటరావును ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడని జె.ఆర్.పురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతులకు సంబంధించి ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎస్సై ఇ. శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేల్పురాయిలో చనిపోయిన పార్వతి మృతదేహాన్ని శ్రీకాకుళం నుంచి వచ్చిన క్లూస్ టీం పరిశీలించి నమూనాలు సేకరించింది.
Comments
Please login to add a commentAdd a comment