ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, కుప్పం: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య ఉదంతాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ వివరాలను పలమనేరు డీఎస్పీ గంగయ్య శనివారం కుప్పం అర్బన్ పోలీసుస్టేషన్‌లో విలేకరులకు వివరించారు. కుప్పం మండలం, గరిగచీనేపల్లెకు చెందిన హరీష్‌కుమార్, స్నేహ భార్యాభర్తలు. కుటుంబాన్ని పోషించేందుకు హరీష్‌కుమార్ హైదరాబాద్‌లో రాళ్ల పాలిషింగ్ పనికి వెళ్లేవాడు. ఈ మధ్య పనులు లేకపోవడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చేశాడు.
భర్త హైదరాబాద్‌లో ఉన్న సమయంలో భార్య స్నేహకు రామకుప్పం మండలం, టేకుమానుతండాకు చెందిన సతీష్‌కుమార్‌నాయక్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త స్వగ్రామానికి తిరిగి రావడంతో వీరి సంబంధానికి అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి ఎలాగైనా హరీష్‌ను హతమార్చాలనుకున్నారు. ఈ క్రమంలో సతీష్‌కుమార్ తన స్నేహితులైన రామకుప్పం మండలం, వీర్నమలతండా, టేకుమానుతండాలకు చెందిన అనీల్‌కుమార్‌నాయక్, శ్రీధర్‌నాయక్, చరణ్‌కుమార్‌నాయక్, బాలాజీనాయక్‌తో రూ.5 లక్షల సుపారీకి ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరికి రూ.30 వేల అడ్వాన్సు సైతం ఇచ్చారు.
చదవండి: (నువ్వు చచ్చిపోతే నా కొడుక్కి మూడో పెళ్లి చేస్తా...)
తరువాత పథకం ప్రకారం స్నేహ భర్త హరీష్‌కుమార్‌ను గత సెప్టెంబర్ 25న కంగుంది అటవీ ప్రాంతంలోని కృష్ణాపురానికి వెళ్లి తన స్నేహితురాలి తమ్ముడు డబ్బు ఇస్తాడని తీసుకురావాలని పంపింది. విషయం తెలియని హరీష్‌కుమార్ కృష్ణపురం వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటువేసిన నలుగురు హరీష్‌ను అతి కిరాతకంగా గొంతుకోసి పొదల్లోకి నెట్టి పరారయ్యారు.
అనంతరం 28న స్నేహ తనకేమీ తెలియనట్లు భర్త కనబడటం లేదని కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని సీఐ శ్రీధర్ తన బృందంతో విచారణ చేపట్టారు. స్నేహ, ప్రియుడు సతీష్‌కుమార్, మరో నలుగురు హత్యకు కారణమని గుర్తించిన పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ గంగయ్య తెలిపారు. సీఐ శ్రీధర్, ఎస్‌ఐలు రామలక్ష్మీరెడ్డి, శివకుమార్‌లను ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment