బరేలీ: యూపీలోని బరేలీలో చిత్రమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. హత్య కేసులో జైలు జీవితాన్ని అనుభవిస్తున్న భర్త కష్టాన్ని భరించలేక బెయిల్ ఇప్పించి విడిపించింది ఆ మహా ఇల్లాలు. తీరా చూస్తే జైలు బయటకు వచ్చిన ఆ కర్కశుడు తన భార్యకు ఆమె స్నేహితుడు మున్నాకి అక్రమ సంబంధముందన్న అనుమానంతో పశ్చిమ ఫతేగంజ్ మార్కెట్లో అందరూ చూస్తుండగానే నిర్దాక్షిణ్యంగా వారిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో భార్య అక్కడికక్కడే చనిపోగా ఆమె స్నేహితుడు మాత్రం హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు.
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..
కృష్ణపాల్ లోధీ, పూజా ఒకరినొకరు ఇష్టపడి 2012లో పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు కూడా ఉన్నారు. కృష్ణపాల్ ఏ ఉద్యోగంలోనూ నిలకడగా ఉండేవాడు కాదు. భర్తకు సరైన ఉద్యోగం లేని కారణంగా పూజ బ్యూటీ పార్లర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించేది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే కృష్ణపాల్ హత్యాయత్నం కేసులో జైలు శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. తన భర్తను విడిపించుకోవడానికి నానా తంటాలు పడి 15 రోజుల క్రితమే బెయిల్ కూడా సంపాదించిందన్నారు పూజ తల్లి షీలా దేవి.
పైత్యం ముదిరింది..
జైలు నుంచి బయటకు వచ్చిన భర్త భార్యపై అనుమానాన్ని పెంచుకున్నాడు. చీటికీ మాటికీ తగువుకి దిగేవాడు. తాగి వచ్చి అనుమానంతో పిచ్చి పిచ్చిగా అరుస్తూ పిల్లల ముందే గొడవ చేసేవాడు. పూజ గట్టిగా మాట్లాడి ఎదురు తిరిగేసరికి కోపంతో ఊగిపోయేవాడని చెప్పింది పూజ తల్లి.
మళ్ళీ జైలుకు..
ఈ కేసును విచారిస్తున్న ఎసిపి రాహుల్ భాటి తెలిపిన వివరాల ప్రకారం.. హత్య చేసిన తర్వాత నిందితుడు స్వయంగా తానే వచ్చి పట్టుబడ్డాడు. తానే అనుమానంతో తన భార్యను హత్య చేశానని, ఆమెకు తగిన శాస్తే జరిగిందని.. దీనికి నేనేమీ చింతించడం లేదని విచారణలో తెలిపాడు. కృష్ణపాల్ లోధీపై హత్య కేసు ఐపీసీ 302 తోపాటు హత్యాయత్నం కేసు ఐపీసీ 307 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: మతమార్పిడులకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment