సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత వివాదాలు, ఆధిపత్య పోరు, పాత కక్షలు, ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలు... ఇలా కారణం ఏదైనా పర్యవసానం మాత్రం హత్యలే. నగరంలో ఇటీవల కాలంలో తరచూ మర్డర్ కేసులు వెలుగు చూస్తున్నాయి. గడచిన 45 రోజుల కాలంలో 19 హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఒక ఉదంతంలో మాత్రం బెంగళూరులో చంపేసిన చిన్నారిని తల్లి, ప్రియుడు నగరానికి తీసుకువచ్చి వదిలేశారు. మరో ఉదంతం జూలైలో చోటు చేసుకోగా... శుక్రవారం హత్యగా తేలింది. హత్య కేసులకు సంబంధించి ఈ కాలంలో 27 మంది కటకటాల్లోకి చేరారు. వీరిలో దారుణాలకు ఒడిగట్టిన వాళ్లు, వారికి సహకరించిన వాళ్లూ ఉన్నారు.
దారుణాలకు కారణాలనేకం..
ఈ హత్యలు కేవలం ప్రత్యర్థులు, శత్రువుల మధ్య మాత్రమే జరగట్లేదు. అనేక కారణాల నేపథ్యంలో సొంత వాళ్లే కత్తి గడుతున్నారు. ప్రధానంగా ప్రేమ వ్యవహారాలను పెద్దలు వద్దనటం, వివాహేతర సంబంధాలకు భర్తలు అడ్డుగా మారడంతో పాటు ఆస్తి వివాదాలు, ఆర్థిక అంశాలు ఈ దారుణాలకు కారణమవుతున్నాయి.
ఇటీవలి హత్యల్లో కొన్ని..
►రూ.2 వేల రుణానికి సంబంధించిన వివాదం ఫరీర్ వాడలో సోను హత్యకు కారణమైంది. సహజీవనం చేస్తున్న డ్యాన్సర్ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో క్యాబ్ డ్రైవర్ అఫ్సర్ ఆమెను అంతం చేశాడు. చుట్టుపక్కల వారితో తనపై భర్త మురళీధర్‌రెడ్డి చెడుగా చెబుతున్నాడంటూ కుమారుడు చెప్పడంతో భర్తతో వాగ్వాదానికి దిగిన మౌనిక అతడిని చంపేసింది.
►మద్యానికి అలవాటుపడిన ఖదీర్ ఆ మత్తు కోసం, మత్తులో మొత్తం ముగ్గురిని బండరాళ్లతో మోది హత్య చేశాడు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంగా మొయినాబాద్‌కు చెందిన జోయాబేగం భర్త ఆదిల్‌ను మరో నలుగురితో కలిసి చంపింది. ఇలాంటి కారణం నేపథ్యంలోనే భర్త ముస్కాన్ పటేల్‌ను భార్య ఫిర్దోష్ బేగం ప్రియుడితో కలిసి హత్య చేసింది. పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేస్తున్న ప్రియురాలు నాగచైతన్యను ప్రియుడు కోటి రెడ్డి బలి తీసుకున్నాడు. తన ప్రేమకు అడ్డు వస్తోందనే కారణంతో చింతల్‌మెట్‌కు చెందిన నందిని తన ప్రియుడు రాంకుమార్‌తో కలిసి తల్లి యాదమ్మను చంపింది.
గొడ్డలితో నరికి..
చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఆర్.దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. జహనుమా ఫయీంబాగ్‌కు చెందిన రంజన్ అలీ కుమారుడు మహ్మద్ షోయబ్ అలియాస్ ఆరీఫ్ అలీ (32) సెల్‌ఫోన్లు విక్రయిస్తుంటాడు. శనివారం రాత్రి షోయబ్ ఇంటి ఎదుట ఫోన్ మాట్లాడుకుంటూ ఉండగా.. ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో షోయబ్ తలపై నరికి పరారయ్యారు. ఆస్తి, కుటుంబ తగాదాల కారణంగానే హత్య జరిగినట్లు ఫలక్‌నుమా పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment