
ప్రతీకాత్మక చిత్రం
కాటారం: విధి ఆ కుటుంబంతో ఆడుకుంటోంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ పిల్లలు తమ కళ్లముందే తనువు చాలించడంతో ఓ అభాగ్య తల్లిదండ్రులు ఒంటరైపోయారు. రెండు నెలల వ్యవధిలో అన్నాచెల్లి వివిధ కారణాలతో మృతిచెంది తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చారు. ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలోని గారెపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కాటారం గ్రామానికి చెందిన పిట్ట మహేశ్, వసంత దంపతులకు కుమారుడు భరత్, కూతురు ప్రతిభ (19).
రెండు నెలల కిందట భరత్ కరీంనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా ప్రతిభ మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతిభ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండేది. ఈ క్రమంలో మంగళవారం తండ్రి మహేశ్ ఊరికి వెళ్లగా తల్లి వసంత గారెపల్లిలోని వాచ్‌షాప్ నిర్వహణకు వెళ్లింది.
ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రతిభ ప్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు ఫోన్ చేయగా ఎంతకూ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన వారు చుట్టు పక్కల వారికి ఫోన్ చేసి చూడమని చెప్పారు. వారు వచ్చి చూడగా ప్రతిభ బలవన్మరణానికి పాల్పడిందని గుర్తించి సమాచారం ఇచ్చారు. ప్రతిభ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. మృతికి సంబంధించి కేసు నమోదు చేసి విచారణ జరపనున్నట్లు ఎస్సై సాంబమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment