Kataram
-
విధి ఆడిన వింత నాటకం: ప్రమాదంలో కొడుకు.. ఉరి వేసుకుని కూతురు..
కాటారం: విధి ఆ కుటుంబంతో ఆడుకుంటోంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ పిల్లలు తమ కళ్లముందే తనువు చాలించడంతో ఓ అభాగ్య తల్లిదండ్రులు ఒంటరైపోయారు. రెండు నెలల వ్యవధిలో అన్నాచెల్లి వివిధ కారణాలతో మృతిచెంది తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చారు. ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలోని గారెపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కాటారం గ్రామానికి చెందిన పిట్ట మహేశ్, వసంత దంపతులకు కుమారుడు భరత్, కూతురు ప్రతిభ (19). రెండు నెలల కిందట భరత్ కరీంనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా ప్రతిభ మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతిభ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండేది. ఈ క్రమంలో మంగళవారం తండ్రి మహేశ్ ఊరికి వెళ్లగా తల్లి వసంత గారెపల్లిలోని వాచ్షాప్ నిర్వహణకు వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రతిభ ప్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు ఫోన్ చేయగా ఎంతకూ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన వారు చుట్టు పక్కల వారికి ఫోన్ చేసి చూడమని చెప్పారు. వారు వచ్చి చూడగా ప్రతిభ బలవన్మరణానికి పాల్పడిందని గుర్తించి సమాచారం ఇచ్చారు. ప్రతిభ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. మృతికి సంబంధించి కేసు నమోదు చేసి విచారణ జరపనున్నట్లు ఎస్సై సాంబమూర్తి తెలిపారు. -
దారుణం: భర్తపై భార్య విషప్రయోగం
సాక్షి, కాటారం(జయశంకర్ భూపాలపల్లి): మూడుమూళ్లు, ఏడు అడుగుల బంధానికి కళంకాన్ని తెచ్చింది ఓ మహిళ. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చింది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రేగులగూడెంలో చోటు చేసుకుంది. ఆగస్టు 19న ఈ ఘటన చోటుచేసుకోగా అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు మిస్టరీని చేధించారు. కాటారం సీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ బి.హతీరాం కేసు వివరాలను వెల్లడించారు. రేగులగూడెం గ్రామానికి చెందిన మారుపాక దేవేందర్(40), మారుపాక స్వప్నకు 12 ఏళ్ల క్రితం వివాహం జరగగా, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఇదే క్రమంలో 2017లో మహాముత్తారం గ్రామానికి చెందిన లింగమళ్ల కళ్యాణ్‌తో స్వప్నకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం దేవేందర్‌కు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆయనను అడ్డు తొలగించాలని స్వప్న, ఆమె ప్రియుడు కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం కళ్యాణ్ పురుగుమందు విషపు గుళికలు స్వప్నకు అందించగా, ఆమె మద్యంలో కలిపి దేవేందర్‌కు ఆగస్టు 19న తాగించింది. మరుసటి రోజు ఉదయం దేవేందర్ వాంతులు, విరోచనాలు చేసుకొని మృతి చెందాడు. అయితే, తన కొడుకు మృతిపై అనుమానం ఉందని దేవేందర్ తండ్రి నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాటారం సీఐ హతీరాం నేతృత్వంలో దర్యాప్తు చేపట్టగా, రసాయనిక పరీక్షల ఆధారంగా మృతుడిపై విషప్రయోగం జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు స్పప్నపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. దీంతో బుధవారం స్వప్న, కల్యాణ్‌లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
విద్యార్థినుల ఆత్మగౌరవ సమస్య
సాక్షి, కాటారం: ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొస్తున్న ప్రభుత్వ పెద్దలు, అధికారుల మాటలు నీటిమూటలుగా మారిపోతున్నాయి. కేజీ టు పీజీ విద్య అమలులో భాగంగా ప్రభుత్వం నూతన భవన నిర్మాణాలకు కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నప్పటికీ గత విద్యా సంస్థల భవనాల్లో నెలకొన్న సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో లక్షల రూపాయలు వెచ్చించి భవనాలు నిర్మించినప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లో మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు, సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. ఆది నుంచి అంతే.. కాటారం మండలంలో 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేసింది. సరైన భవన నిర్మాణం లేకపోవడంతో తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన భవనంలో తరగతుల నిర్వహణ కొనసాగించారు. గత కొన్నాళ్ల పాటు కళాశాల అదే భవనంలో కొనసాగగా పాఠశాలకు తరగతుల కొరత ఏర్పడడంతో భవనం పాఠశాలకు అనివార్యమైంది. దీంతో అదే పాఠశాల భవన సముదాయం ఆవరణలో అప్పటి కాంగ్రెస్ హయాంలో రూ.40లక్షల నక్సల్స్ ప్రభావిత ప్రాంత అభివృద్ది నిధుల(ఐఏపీ) ద్వారా నిర్మించిన భవనంలోకి కళాశాలను మార్చి తరగతులు చేపడుతున్నారు. సివిల్, కోపా, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ లాంటి ట్రేడ్స్ అందుబాటులో ఉండటంతో కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది. మారుమూల గ్రామాలకు కళాశాల అందుబాటులో ఉండడంతో విద్యార్థినులు అధిక సంఖ్యలో ప్రవేశం పొందారు. కానీ కళాశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థినులు, మహిళా అధ్యాపకుల ఆగచాట్లు వర్ణనాతీతంగా మారాయి. కళాశాలకు సరైన భవనం నిర్మాణం చేపట్టినప్పటికీ మరుగుదొడ్ల నిర్మాణం మాత్రం లేకపోవడంతో విద్యార్థినులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోని పాఠశాలకు సంబంధించిన మరుగుదొడ్లు వినియోగిస్తున్నా కొన్ని సార్లు పాఠశాల తరఫున అభ్యంతరాలు ఎదురవుతున్నట్లు విద్యార్థినులు తెలిపారు. అంతేకాకుండా సెలవు దినాల్లో ఈ పరిస్థితి మరింత అయోమయంగా ఉంటున్నట్లు వారు పేర్కొన్నారు. సెలవు రోజుల్లో పాఠశాల మరుగుదొడ్లకు తాళం వేసి ఉంటుండడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయమైన దుస్థితి ఉంటుందని వాపోయారు. లక్షలు వెచ్చించి భవనాలు నిర్మించినప్పటికీ మరుగుదొడ్లు మాత్రం నిర్మించకపోవడం దారుమని వాపోతున్నారు. ఇంత పెద్ద కళాశాలలో సౌకర్యాలు సరిగా లేకపోవడం శోచనీయం అని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్డి నిర్మాణం మహిళల ఆత్మగౌరవ సమస్యగా చెప్పుకొస్తూ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు ప్రభుత్వం సంస్థల్లోనే మరుగుదొడ్ల నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఐటీఐలో మరుగుదొడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు, మహిళా సిబ్బంది కోరుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇదే దుస్థితి.. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సైతం సమస్యలకు నిలయంగా మారింది. పక్కా భవనం ఉన్నప్పటికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి నూతన భవనం నిర్మించారు. మరుగుదొడ్లు వినియోగంలో లేకపోవడంతో విద్యార్థుల సమస్య వర్ణానాతీతంగా మారిపోయింది. ఒంటికి రెంటికి కిలో మీటరు దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటుందని విద్యార్థులు తెలుపుతున్నారు. భవనం నిర్మించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ మరుగుదొడ్ల వాడకంలో రాకపోవడంతో తిప్పలు తప్పడం లేదు. పురాతన షెడ్డు ఆవరణలో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ అవి శిథిలావస్థకు చేరడంతో వినియోగించలేని పరిస్థితి ఉంది. నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లు నీటి సౌకర్యం లేక ఉపయోగంలోకి రావడం లేదు. ఇటీవల పలు విద్యార్థి సంఘాల నాయకులు ఐటీఐ, ప్రభుత్వ కళాశాలలోని అసౌకర్యాలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన స్థానిక ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ప్రజాప్రతినిధులు విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. పరిష్కారానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్తామని హామీ ఇచ్చారు. ఏదేమైనా జిల్లా స్థాయి కళాశాలలు ఈ ప్రాంతంలో ఉన్నప్పటీకీ సౌకర్యాల లేమి వెంటాడుతుండటంతో విద్యా ర్థులు కళాశాలలకు రావడానికి ఆసక్తి చూపడం లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరుగుదొడ్లు లేక ఇబ్బందులు కళాశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాలలో ఉంటాం. అత్యవసర సమయాల్లో మరుగుదొడ్ల అవసరం ఎంతగానో ఉంటుంది. కళాశాలకు వచ్చిందంటే వెళ్లే వరకు మా పరిస్థితి అయోమయంగా నెలకొంటుంది. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. – రమ్య, ఐటీఐ, ప్రథమ సంవత్సరం విద్యార్థిని పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి కళాశాలలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి. ఇంత పెద్ద కళాశాల అయినప్పటికీ తగిన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. మలమూత్ర విసర్జన కోసం మైలు దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మా సమస్యను పట్టించుకునే వారే లేరు. – రాజేశ్, విద్యార్థి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కాటారం -
కాటారంలో 'మావో' కరపత్రాల కలకలం
సాక్షి, కాటారం(వరంగల్) : కాటారం సబ్ డివిజన్లోని పలు మండలాల్లో కొన్ని రోజులుగా కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పలిమెల మండలంలోని సర్వాయిపేట, మహాముత్తారం మండలం కనుకునూర్‌లో పలువురు ప్రజాప్రజాప్రతినిధులు, నాయకులను హెచ్చరిస్తూ మావోయిస్టులు కరపత్రాలు వేయగా తాజాగా మంగళవారం కాటారం మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) పేరిట కరపత్రాలు వెలిశాయి. మండల కేంద్రానికి కూత వేటు దూరంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల గేటుతో పాటు కాటారంలోని పలు ఇళ్ల గోడలపై మావోల పేరిట రాసిన కరపత్రాలు దర్శనమిచ్చాయి. కాటారం మండల కేంద్రానికి చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు బొమ్మ మల్లారెడ్డిని టార్గెట్ చేస్తూ కరపత్రాలు వెలిసాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో చైర్మన్ పదవిని అడ్డుపెట్టుకుని మేడారం, తాడ్వాయి మండలంలో 150 ఎకరాల భూమి కబ్జాకు పాల్పడటంతో పాటు ముకునూరు, నీలంపల్లిలో 430 ఎకరాల భూమి అక్రమంగా స్వాధీనపర్చుకున్నారని కరపత్రాల్లో పేర్కొన్నారు. రెండు రోజుల్లో ఆ భూములను ప్రజలకు తిరిగి ఇవ్వాలని, లేదంటే ఆయనతో పాటు కుటుంబసభ్యులను కాల్చి చంపుతామని కరపత్రాల ద్వారా హెచ్చరించారు. కాగా, కరపత్రాల్లో భారతకమ్యూనిస్టూ పార్టీ (మావోయిస్టు) అనేది మాత్రమే ఎరుపు రంగు పెన్నుతో రాసి మిగితా లేఖ మొత్తం బ్లూ పెన్నుతో రాయడంతో ఇవి నకిలీ కరపత్రాలనే సందేహాలు వెలువడుతున్నాయి. మల్లారెడ్డితో వైరం ఉన్నవారు ఎవరో భయభ్రాంతులకు గురి చేయడానికి నకిలీ కరపత్రాలు సృష్టించి ఉంటారని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. కరపత్రాల్లో పేర్కొన్నట్లు మల్లారెడ్డికి భూములు లేనట్లు సమాచారం. కాగా, సమాచారం తెలుసుకున్న సీఐ హతీరాం, ఎస్సై2 జహీర్‌ఖాన్ సంఘటనా స్థలానికి చేరుకుని కరపత్రాలను స్వాధీనపర్చుకున్నారు. ఈ విషయమై సీఐ హతీరాంను వివరణ కోరగా అవి నకిలీ కరపత్రాలని కొట్టిపారేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని, త్వరలోనే ఈ చర్యలకు పాల్పడిన వారిని పట్టుకుంటామని తెలిపారు. -
ఇసుక దందా
ఎన్నికల సమయం అక్రమార్కులకు కలిసి వస్తోంది. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఎలక్షన్ విధుల్లో తలమునకలై ఉండగా.. ఈ పరిస్థితులను ఇసుకాసురులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వర్షాకాలంలో కాస్త తగ్గిన ఇసుక అక్రమ రవాణా ప్రస్తుతం మళ్లీ పెరిగింది. ఇదే అదనుగా నకిలీ నంబర్ ప్లేట్లతో ఇసుకను కొల్లగొడుతున్నారు. నెలరోజుల వ్యవధిలో జీరో బిల్లింగ్ ద్వారా 10, నకిలీ నంబర్ ప్లేట్లతో ఇసుక తరలిస్తున్న 22 లారీలు పట్టుబడడం ఇందుకు నిదర్శనం. సాక్షి, కాటారం : మహదేవపూర్, కాటారం మండలంలోని క్వారీల ద్వారా పలువురు లారీల యజమానులు, వ్యాపారులు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. గతంలో అడపాదడపాగా కొనసాగినమీ దం దా ప్రస్తుతం పెరిగిపోయింది. రోజుకు 5 నుంచి 10 లారీల వరకు వేబిల్లులు లేకుండా, నకిలీ నం బర్ల ప్లేట్లతో ఇసుకను తరలిస్తున్నాయి. ఈ జీరో దందాకు పలు ఇసుక క్వారీల నిర్వాహకులతోపాటు టీఎస్ఎండీసీకి చెందిన పలువురు సిబ్బంది, స్థానికులు సహకరిస్తున్నట్లు సమాచారం. కేవలం లారీల ద్వారానే కాకుండా గోదావరి, మానేరు నదుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకొచ్చి ఒక చోట డంప్ చేసి వే బిల్లులు లేకుండా లారీల ద్వారా పట్టణాలకు తరలిస్తున్నారు. జీరో దందా ఇలా.. కాటారం మండలంలో 4 ఇసుక రీచ్‌లు, మహదేవపూర్ మండలంలో 23 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. వీటి ద్వారా వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ తదితర నగరాలకు ఇసుక రవాణా అవుతోంది. ప్రస్తుతం నడుస్తున్న ఇసుక రీచ్‌లలో సుమారు 18కి పైగా వాటిలో జీరో దందా కొనసాగుతున్న ట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు రోజు వారీ ఇసుక వివరాలకు అనుగుణంగా టీఎస్ఎండీసీ సైట్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి. యజ మానులు తీసిన డీడీని సదరు క్వారీల వద్ద ఉండే టీఎస్ఎండీసీ సిబ్బంది, క్వారీ నిర్వాహకులు చెక్ చేసి ఇసుక లోడింగ్‌కు అనుమతించాలి. అయితే పలు క్వారీల వద్ద ఇలాంటి నిబంధనలు కానరావడం లేదు. టీఎస్ఎండీసీ సిబ్బంది కమీషన్లకు కక్కుర్తిపడి వే బిల్లులు లేకుండానే ఇసుక రవా ణాకు అనుమతిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. దాడులతో రూటు మార్చిన అక్రమార్కులు.. ఇటీవల కాలంలో పోలీసుల దాడులు ఎక్కువ కావడంతో అక్రమ రవాణాదారులు మరో దందాకు తెరలేపారు. నకిలీ నంబర్ ప్లేట్లను సృష్టించి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నా రు. ఇసుక నిల్వలకు సబంబంధించి టీఎస్ఎండీసీ అధికారులు రోజు వారీగా వివరాలను ఆన్లైన్ చేయడానికి కొంత సమయం కేటాయిస్తారు. సమయం తక్కువగా ఉండడంతో ఆన్లైన్ బుకింగ్ కష్టతరంగా మారిపోయింది. దీంతో కొందరు ఆన్లైన్లో ఏదో ఒక లారీ నంబర్‌పై ఇసుక బుకింగ్ చేసి మరో లారీకి అమ్ముకుంటున్నారు. ఆన్లైన్లో బుక్‌చేసిన నంబర్‌తో డీడీ తీసి లారీ అదే నంబర్ ప్లేట్ వేసి ఇసుక తరలిస్తున్నారు. ఇలా రోజుకు అనేక లారీలు ఈ ప్రాంతం నుంచి పట్టణాలకు తరలివెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సిబ్బంది కనుసన్నల్లోనే అ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా అక్రమ రవాణా పొరుగు జిల్లాలో తవ్వకం.. మన జిల్లా మీదుగా తరలింపు అదనపు లోడు.. వేబిల్లులు లేకుండా.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పోలీసుల తనిఖీల్లో బయటపడిన వైనం పట్టించుకోని సంబంధిత అధికారులు మంగపేట పోలీసులు పట్టుకున్న ఇసుక లారీలు భద్రాద్రి జిల్లాలో తవ్వకాలు చేపట్టిన ఇసుకను మన జిల్లా మీదుగా అక్రమంగా తరలిస్తున్నారు. మంగపేట మండలానికి పొరుగున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వీరాపురం, సాంబాయిగూడెం గోదావరి ఇసుక క్వారీల నుంచి లారీల్లో అధిక లోడుతో హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న విషయం పోలీసుల తనిఖీల్లో బయటపడింది. రాత్రి సమయాల్లో నిత్యం వందల లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా సంబంధిత మినరల్స్ అండ్ మైనింగ్ అధికారులు పట్టించుకోక పోవడం విమర్శలకు తావిస్తొంది. రాత్రి.. పగలు.. మంగపేట మండలం మీదుగా రాత్రి.. పగలు తేడా లేకుండా ఇసుక లారీల రద్దీ తీవ్రంగా పెరిగింది. సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారే వరకు రవాణా జరుగుతోంది. రాత్రి సమయంలో రవాణా అయ్యే ఇసుక లారీలకు వే బిల్లులు ఉండడంలేదు. పగటి వేళల్లో అదనపు లోడుతో తరలిస్తున్నారు. విషయం బయటకకు రాకుండా ఉండేందుకు పలు వేబ్రిడ్జీల నిర్వాహకులను మచ్చిక చేసుకుని అదనంగా ఉన్న లోడును తగ్గించి రిసిప్టు తీసుకుంటున్నట్లు సమాచారం. చెక్‌పోస్ట్‌ల్లో అధికారులు తనిఖీలు చేసిన సందర్భంలో రిసిప్టులు చూపించి తప్పించుకుంటున్నారు. అదనపు లోడు ఇసుకను అనువైన ప్రాంతాల్లో డంపు చేసి అమ్ముకుంటున్నట్లు తెలిసింది. లీజు పేరుతో అక్రమ దందా.. పేరుకు ఇతర జిల్లాకు చెందిన క్వారీలని చెబుతున్నప్పటికీ మంగపేట మండలం పరిధి కిందకు వచ్చే ప్రాంతంలోని ఇసుకను కొల్లగొడుతున్నారని కత్తిగూడెం, బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. భద్రాద్రి జిల్లా పినపాక మండలం దుగినేపల్లి పంచాయతీ పరిధిలోని వీరాపురం గిరిజన సొసైటీకి చెందిన ఇసుక క్వారీతోపాటు, మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీ పరిధిలోని సాంబా యిగూడెం ఇసుక క్వారీలను హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నట్లు సమాచారం. వారు రాజకీయ నాయకుల అండతో అక్రమ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్వారీల నుంచి అదనపు లోడుతో తరలిస్తున్న వ్యవహారం బయటకు తెలియకుండా ఉండడటానికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. క్వారీల వైపు ఎవరుకూడా రాకుండా కొందరిని నిరంతరం కాపాల పెట్టి వారికి నెలనెలా రూ.20 వేల చొప్పున చెల్లిస్తున్నట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం కొందరు యువకులు ఇసుక క్వారీ ప్రాంతంలోని గోదావరిలో స్నానానికి వెళ్లి సెల్ఫీలు దిగుతుండగా వారి నుంచి సెల్ఫోన్లు లాక్కుని ఇటువైపు రావద్దని హెచ్చరించినట్లు సమాచారం. కిరాయి మూకల చర్యలతో క్వారీలకు సమీపంలో ఉన్న దుగినేపల్లి, టీకొత్తగూడెం, అకినేపల్లిమల్లారం గ్రామాల ప్రజలు అటువైపు వెళ్లడానికి జంకుతున్నారు. 10 లారీలపై కేసు నమోదు ఇసుక అక్రమ రవాణా వ్యవహారం గతనెల 3వ తేదీ రాత్రి తనిఖీల్లో బయట పడింది. స్థానిక ఎస్సై వెంకటేశ్వర్రావు మంగపేట వద్ద ఏటూరునాగారం–బూర్గంపాడ్ ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆ సమయంలో ఇసుకను తరలిస్తున్న లారీలకు సరైన వే బిల్లులు లేకపోవడాన్ని గమనించారు. అనుమానం వచ్చిన పోలీసులు కమలాపురం వేబ్రిడ్జ్కు తరలించి కాంటా వేయిస్తే ఒక్కొ లారీకి 3 నుంచి 5 టన్నుల వరకు అదనపు ఇసుక తరలిస్తున్న విషయం బయటపడింది. దీంతో 10 లారీలపై కేసులు నమోదు చేశారు. -
తెలుగు గంగలో పడి విద్యార్థి గల్లంతు
సాక్షి, బుచ్చినాయుడుకండ్రిగ : చిత్తూరుజిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంకాటూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పండుగకు అక్క ఇంటికి వచ్చిన ఓ బాలుడు తెలుగుగంగ మెయిన్ కాలువలో పడి గల్లంతయ్యాడు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఏఎంపుత్తూరుకు చెందిన నాదముని కుమారుడు సాయి (15) పదో తరగతి చదువుతున్నాడు. పండుగకు కాటూరు గ్రామం అరుంధతివాడలోని అక్క ఇంటికి వచ్చాడు. శుక్రవారం సాయంత్రం తెలుగుగంగ కాలువ వద్దకు బహిర్భూమికి వెళ్లగా కాలు జారి నీటిలో పడిపోయాడు. ఇది గమనించిన మరో యువకుడు ఇంటికెళ్లి సమాచారమందించగా సాయి కోసం స్థానికులు కాలువలో గాలించారు. అయినా ఆచూకీ దొరకలేదు. శనివారం గజ ఈతగాళ్లు వచ్చి గాలించినా ఫలితం లేకపోయింది. బంధువులు కాలువ వద్దనే ఉండి అతడి కోసం వేచి చూస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. -
బైక్, వ్యాన్ ఢీ: ఇద్దరు యువకులు మృతి
కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మద్దులపల్లి ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఓమ్ని వ్యాన్, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న కొత్తపల్లికి చెందిన కాలనేని సంతోష్(18), కందుల గిరిబాబు(29) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. -
కల్తీ మద్యం సేవించి వ్యక్తి మృతి
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని కాటారం మండలంలోని గుమ్మళ్లపల్లి గ్రామంలో కల్తీ మద్యం కలకలం రేపుతోంది. బుధవారం సాయంత్ర కల్తీ మద్యం సేవించి పలువురు అస్వస్థతకు గురి కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఎర్రోళ్ల లాస్మయ్య(50) చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో ఆరుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన కాటారం ఎక్సైజ్ ఎస్సై శీలం రాజేశ్వరిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ మురళి ఆదేశాలు జారీచేశారు. -
15 మంది అరెస్ట్
రూ.2.20 లక్షలు, ఆరు బైక్‌లు, 15 సెల్ఫోన్లు స్వాధీనం కాటారం: కాటారం సమీపంలోని నస్తూర్‌పల్లి అటవీ ప్రాంతంలోని పేకాట స్థావరంపై మంగళవారం సాయంత్రం పోలీసులు దాడి చేశారు. పక్కా సమాచారంతో ఎసై ్స టి.కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో సొత్తు, బైక్‌లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ సదన్‌కుమార్ వివరాలు వెల్లడించారు. మండలంతోపాటు భూపాలపల్లి ఇతర ప్రాంతాలకు చెందిన పేకాటరాయుళ్లు ఇక్కడకు వచ్చి పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎసై ్స దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 15 మంది పేకాటరాయుళ్లను పట్టుకుని వారి నుంచి రూ.2.22 లక్షల నగదు, ఆరు బైక్‌లు, 15 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. మోరంచపల్లికి చెందిన ముత్యాల విష్ణు పేకాట కోసం తన భార్య నగలు తీసుకురాగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చన్నుట్లు సీఐ తెలిపారు. -
మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్న రెండో ఏఎన్ఎంలు
కాటారం : కాటారం మండల కేంద్రంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెండో ఏఎన్ఎంలు శుక్రవారం మంత్రి చందూలాల్ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. మేడిపల్లి ఆశ్రమ పాఠశాలలో నూతన భవన సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి మహదేవపూర్ పయనమయ్యారు. మార్గమధ్యంలో మండల కేంద్రానికి వస్తున్నారని తెలుసుకున్న రెండో ఏఎన్ఎంలు ప్రధాన కూడలి వద్ద రాస్తారోకో చేపట్టి మంత్రి కాన్వయ్‌ని అడ్డుకున్నారు. ఇది గమనించిన మంత్రి వాహనం దిగి వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇలా నిరసన తెలపడం సబబుకాదని సూచించారు. గత పది రోజులుగా దీక్ష చేస్తున్నా తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని రెండో ఏఎన్ఎంలు మంత్రితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని మంత్రి ఏఎన్ఎంలకు హామీ ఇచ్చారు. -
స్పోర్ట్స్స్కూల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఆదర్శ విద్యార్థులు
కాటారం: తెలంగాణ క్రీడాపాఠశాలలో ప్రవేశం కోసం నిర్వహించే రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు మండలంలోని ఆదర్శవిద్యాసంస్థలకు చెందిన 13 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 12, 13 తేదీల్లో కరీంనగర్లో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ఆదర్శపాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చడంతో నిర్వాహాకులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేశారు. ఎంపికైన వారిలో నితీశ్, సాయికిరణ్, రంజిత్, శ్రీను, సింహాద్రి, అభికుమార్, కల్యాణ్, సాయిచరణ్, సాయిప్రసన్న, శైలజ, భువనకృతి, స్వర్ణలత, అఖిల ఉన్నారు. జిల్లా నుంచి ఎంపికైన వారిలో సగం మంది ఆదర్శవిద్యార్థులే. వీరంతా ఈ నెల 21, 22 తేదీల్లో హకీంపేటలోని క్రీడాపాఠశాలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. ఎంపికైన విద్యార్థులను విద్యాసంస్థల అధినేత జనగామ కార్తీక్‌రావు, ప్రిన్సిపాల్ కృషితరావు, వెంకటేశ్వరరావు, కోచ్‌లు మార్క రాముగౌడ్, అంకూస్, సమ్మయ్య అభినందించారు. -
కరీంనగర్లో దారుణం
కాటారం (కరీంనగర్) : కరీంనగర్లో దారుణం చోటుచేసుకుంది. వావి వరసలు మరచి వదినపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తి.. ఆమె ప్రతిఘటించడంతో చివరకు గొంతు నులిమి హత్య చేశాడు. ఈ సంఘటన కాటారం మండలం చింతకాని గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చీరాల పోచం(44) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి బాగా మద్యం సేవించి పక్కనే ఉన్న వదిన చీరాల లచ్చక్క(45) ఇంట్లోకి వెళ్లి ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆమె కేకలు వేసింది. ఆమె అరిస్తే తన బుద్ధి బయట పడిపోతుందని గొంతు నులిమి హత్య చేశాడు. ఆదివారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
వైఎస్ఆర్కు మరణం లేదు: వైఎస్ షర్మిల
కరీంనగర్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి మరణం లేదని, తెలుగు జాతి ఉన్నంతవరకూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని ఆయన కుమార్తె వైఎస్ షర్మిల అన్నారు. పరామర్శ యాత్రలో భాగంగా ఆమె మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. కాటారం మండలం గారేపల్లి చౌరస్తాలో వైఎస్ షర్మిల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల బాధను తన బాధగా భావించి ప్రతి ఒక్కరికీ మేలు చేయడం వల్లే రాజశేఖరరెడ్డి...రాజన్న అయ్యారని ఆమె పేర్కొన్నారు. కాగా కాటారం మండలంలోని మారుమూల గ్రామం బోర్లగూడెంలో వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన అసోదుల రామయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. రాత్రి ఆమె కాటారంలోనే బస చేస్తారు. -
యువరైతు ఆత్మహత్య
కాటారం (కరీంనగర్) : అప్పులబాధతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మలహర్రావు మండలం కొయ్యూరు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన వంశీకృష్ణ(30) తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండు సంవత్సరాలుగా పంటలు సరిగా పండక అప్పులు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపం చెంది శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అయ్యా... మా కొడుకుల జాడ చెప్పుండ్రి
మేం కాటికి దగ్గర అవుతున్నం... కుక్కిన పడితే చూసుకునే దిక్కులేదు... ఇరవై ఏడేండ్లుగా కన్న కొడుకుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నం... వాళ్లు ఏమైండ్లో ఇంతవరకు జాడ లేదు... అసలు మా బిడ్డలు బతికున్నరా లేదా... అదన్నా చెప్పుండ్రి... ఈ తల్లులు కన్నీళ్లు తుడువుండ్రి బాంచెన్...’’ ఇది కాటారం మండలం గుమ్మాళ్లపల్లికి చెందిన చల్ల రాజుబారుు, గోసికె లచ్చక్కల అవేదన. పంచాయితీ కోసమని ఇంటి నుంచి వెళ్లిన కొడుకులు ఇగ వస్తరు... అగ వస్తరు అని 27 ఏళ్లుగా ఎదురుచూస్తున్న తల్లుల వేదన. తమ కొడుకుల ఫొటోలు చూపుతూ గురువారం విలేకరుల ఎదుట ఆ ఇద్దరు వృద్ధులు తమ గోడును వెల్లబోసుకున్నారు. వారు చెప్పిన వివరాలు... కాటారం : 1989, జనవరి 12న చల్ల రాజుబాయి కుమారుడు చల్ల బాపురెడ్డి(22), గోసికె లచ్చక్క కుమారు డు గోసికె రాజయ్య(23), వీరాపూర్ కు చెందిన బొమ్మ జనార్దన్‌రెడ్డి(23) కలిసి మహదేవపూర్ మండలం సూ రారంకు పంచాయితీ నిమిత్తం ఒకే ద్విచక్ర వాహనంపై వెళ్లారు. పంచాయితీ పూర్తయిన అనంతరం తిరుగు ప్రయాణంలో సూరారం సమీపంలోని కొంగలవాగు వద్ద పోలీసులు ఈ ముగ్గిరిని అపహరించుకుపోయినట్లు ప్రచారం జరిగింది. కానీ తమకు ఎ లాంటి సమాచారం ఇవ్వలేదని రాజుబాయి, లచ్చక్క తెలిపా రు. రోజులు గడిచినా తమ కొడుకుల ఆచూకీ తెలియకపోవడంతో గ్రామస్తులు, బంధువుల సహకారంతో మహదేవపూర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. తమ కొడుకుల ఆచూకీ తెలుపాలంటూ పోలీసు అధికారుల కాళ్లావేళ్లా ప్రాధేయపడ్డా రు. పోలీసులు తమకు తెలియదని చెప్పడంతో మానవహక్కు ల సంఘాన్ని ఆశ్రయించారు. మానవ హక్కుల నేతలు వరవరరావు, బాలగోపాల్‌లను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నామన్నారు. వారి సహకారంతో హైకోర్టులో కేసు సైతం వేశారు. అరుునా ఫలితం దక్కలేదని వారు వాపోయూరు. ఇదిలా ఉండగా... జనవరి 18న మహాముత్తారం మండలం పెగడపల్లి సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో తమ కుమారులు చనిపోయారని పోలీసులు ప్రకటించినట్లు అప్పట్లో పేపర్లలో వచ్చిందని అంటుంటే విన్నాం.. కానీ మాకు శవాలను కూడా చూపించలేదని వారు తెలిపారు. అది వాస్తవమా కాదా అని తేల్చుకోలేకపోతున్నామంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ కుమారులు ఎన్కౌంటర్లో చనిపోతే తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని, మృతదేహాలను ఎందుకు అప్పగించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. వారు మృతి చెందారా లేక బతికి ఉన్నారా అన్న సంశయంలో కాలం వెల్లదీస్తున్నామని ఆ తల్లులు కన్నీటిపర్యంతమయ్యూరు. ఒకవేళ మృతి చెందితే మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వమన్నా అధికారులు తిప్పించుకున్నారే తప్ప ఇవ్వలేదని పేర్కొన్నారు. వృద్ధాప్యంలో దిక్కుమొక్కు లేక ఉన్నామని, తమను చూసుకునేవారు లేరంటూ బోరున విలపించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ కుమారుల విషయంపై వివరణ ఇవ్వాలని, ప్రభుత్వ పరంగా తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు పోలీసుల రికార్డుల్లో.. బాపురెడ్డి, రాజయ్య పీపుల్స్‌వార్ పార్టీ సానుభూతిపరులుగా వ్యవహరించారని, వీరు ఎన్కౌంటర్లో మృతి చెందారని అప్పటి పోలీసులు ప్రకటించి రికార్డుల్లో పేర్కొన్నారు. కానీ జనార్దన్‌రెడ్డికి సంబంధించిన ఎలాంటి వివరాలను పోలీసు లు తెలియపర్చలేదు. ఎన్కౌంటర్లో బాపురెడ్డి, రాజయ్య మృతి చెందారని తమకు ఎలాంటి ఆనవాళ్లు కానీ, సమాచా రం కానీ పోలీసులు ఇవ్వలేదని, తమ కుమారులే మృతి చెం దారని ఎలా తెలుస్తుందని వారి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. వీరు హైకోర్టుతో పాటు మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో అప్పట్లో కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిర్వహించిన అధికారులు వివరాలు సేకరించారు. పెగడపల్లి గ్రామానికి వెళ్లి సాక్షుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఎన్కౌంటర్లో చనిపోయినట్లు పోలీసులు రికార్డులు సమర్పించినట్లు సమాచారం. ఇప్పటి వరకు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయట కు రాలేదని తెలిసింది. ఓ పక్క ఎన్కౌంటర్లోనే బాపురెడ్డి, రా జయ్య మృతి చెందారని పోలీసు రికార్డులు తెలుపుతున్పప్పటికీ మృతి చెందిన వారు తమ వారని నిర్ధారణకు రాలేకపోతున్నామని వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్భర స్థితిలో వృద్ధులు బాపురెడ్డి తల్లి రాజుబాయి, రాజయ్య తల్లి లచ్చక్క, జనార్దన్‌రెడ్డి కుటుంబసభ్యులు దుర్భర స్థితిని అనుభవిస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు జనార్దన్‌రెడ్డికి వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉండగా, మిగతా ఇద్దరికి వివాహం కాలేదు. ప్రస్తుతం రాజుబాయి, లచ్చక్కలకు పూట గడవడమే కష్టంగా ఉంది. పెన్షన్‌పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నప్పటికీ ఆలనాపాలనా కరువైంది. కనీసం తమ కుమారులు మృతి చెందారని ధ్రువీకరణ పత్రం అయినా ఇచ్చివుంటే ఎల్ఐసీ లాంటి పాలసీలు వర్తించి తమకు ఆధారంగా ఉండేవంటున్నారు. కాగా ఆచూకీ తెలియకుండా పోరుున బొమ్మ జనార్దన్‌రెడ్డి సతీమణి ప్రేమలత ఇటీవల ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీని కలిసి తన గోడును వెల్లబోసుకోగా ప్రభుత్వం ద్వారా రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరైంది. ఈనెల 29న చెక్కును అందజేశారు. తన కుమారునికి ఉద్యోగం ఇవ్వడానికి సీఎం హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.