మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్న రెండో ఏఎన్‌ఎంలు
Published Fri, Jul 29 2016 7:03 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
కాటారం : కాటారం మండల కేంద్రంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెండో ఏఎన్‌ఎంలు శుక్రవారం మంత్రి చందూలాల్ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. మేడిపల్లి ఆశ్రమ పాఠశాలలో నూతన భవన సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి మహదేవపూర్ పయనమయ్యారు. మార్గమధ్యంలో మండల కేంద్రానికి వస్తున్నారని తెలుసుకున్న రెండో ఏఎన్‌ఎంలు ప్రధాన కూడలి వద్ద రాస్తారోకో చేపట్టి మంత్రి కాన్వయ్‌ని అడ్డుకున్నారు. ఇది గమనించిన మంత్రి వాహనం దిగి వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇలా నిరసన తెలపడం సబబుకాదని సూచించారు. గత పది రోజులుగా దీక్ష చేస్తున్నా తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని రెండో ఏఎన్‌ఎంలు మంత్రితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని మంత్రి ఏఎన్‌ఎంలకు హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement