వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ
ప్రస్తుత ఏఎన్‌ఎం నోటిఫికేషన్‌కు మరో 323 పోస్టులు
29న ఏఎన్‌ఎం రాత పరీక్ష యథావిధిగా జరుగుతుందని వెల్లడి
హైదరాబాద్: రెగ్యులర్ ఉద్యోగులను నియమించి నప్పటికీ, కాంట్రాక్టు ఏఎన్‌ఎంలను ఉద్యోగాల నుంచి తీసేయబోమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రిని ఏఎన్‌ఎంలు కలిసి తమ సమస్యలు విన్నవించారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. అయితే ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని మంత్రి తెలిపారు. ఏఎన్‌ఎం రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఈ నెల 29న నిర్వహించనున్న పరీక్ష యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు.
ఈ పరీక్షకు హాజరయ్యే కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలకు 30 మార్కులు వెయిటేజీ ఇస్తున్నామని గుర్తుచేశారు. పోస్టుల సంఖ్యను పెంచాలని ఏఎన్‌ఎంలు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం నోటిఫికేషన్‌లో ఇచ్చిన 1,931 పోస్టులకు అదనంగా మరో 323 పోస్టులను కలిపి, ఇదే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రెగ్యులర్ ఉద్యోగం రానివారిని, చివరి వరకూ కాంట్రాక్ట్ ఉద్యోగంలో కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఏఎన్‌ఎంలు కోరగా, సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment