minister chandu lal
-
మంత్రి గన్‌మన్ ఇంట్లో చోరీ
బీమారం : మంత్రి చందూలాల్ వద్ద గన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న అమృసింగ్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి... 46వ డివిజన్ గోపాలపురంలోని రేణుక,ఎల్లమ్మకాలనీలో నివాసముంటున్న అమృసింగ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏఆర్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం మంత్రి చందూలాల్ వద్ద గన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అమృసింగ్ అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు మెరుగైనా వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొంది శనివారం డిశ్చార్జ్ అయ్యాడు. కాగా శనివారం అమృసింగ్ ఇంటికి చేరడంతో తలుపులు ధ్వంసమైన కనిపించాయి. లోపలికి వెళ్లగా బీరువా తెరచి ఉంది. దీంతో ఆందోళనకు గురైన అమృసింగ్ కుటుంబ సభ్యులు బీరువాను పరిశీలించగా తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు, రూ. 26 వేల నగదు అపహరించినట్లు తెలిపారు. దీంతో పాటు బీరువాలో లభ్యమైన వెండి ఆభరణాలను మాత్రం దుండగులు మంచంపై పడేసి వెళ్లారు. పథకం ప్రకారమే చోరీ.. దుండగులు ఓ పథకం ప్రకారమే చోరీకి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. డాగ్ స్వా్కడ్ పసిగట్టకుండా ఉండేందుకు ఇంటిలో కారం పొడి చల్లారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఏసీపీ.. సంఘటన స్థలాన్ని హన్మకొండ ఏసీపీ రాజేంద్రప్రసాద్, పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్‌బాబులు సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడారు. అలాగే సంఘటన స్థలం నుంచి వేలిముద్ర నిపుణులు వేలిముద్రలు సేకరించారు. -
ట్రేడ్ ఫేర్‌లో డిజిటల్ తెలంగాణ పెవిలియన్
- ప్రారంభించనున్న మంత్రి చందూలాల్ న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సోమవారం ప్రారంభకానున్న భారత-అంతర్జాతీయ ట్రేడ్ ఫేర్‌లో తెలంగాణ రాష్ట్రం ‘డిజిటల్ తెలంగాణ’ పేరుతో పెవిలియన్‌ను ఏర్పాటు చేయనుంది. టీ-హబ్‌తోపాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాట్లు చేయనున్నారు. ఇన్నోవేషన్, ఇంక్యూబేషన్, స్టార్టప్ ఐటీ అనే మూడు అంశాలు డిజిటల్ తెలంగాణ త్రీడీ డిజైన్‌లో ప్రముఖంగా కనిపించున్నాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పురోభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రపంచ స్థాయి సంస్థలు తెలంగాణలో ఏర్పాటు కావడం, వాటికి కల్పిస్తున్న సదుపాయాలను తెలిపేవిధంగా పెవిలియన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా రాష్ట్ర చేనేతాభివృద్ధి సంస్థ, హస్తకళలు, పాడి పరిశ్రమల అభివృద్ధి సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ తదితర విభాగాలు తమ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. వీటిని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ప్రారంభించనున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఫేర్‌లో 21వ తేదీన ఒగ్గు డోలు, పేరిణి నృత్యం, ఖవ్వాలీ, కొమ్ము కోయ వంటి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైవిధ్యతను ప్రదర్శించనున్నారు. -
ప్రజలకు నాణ్యమైన సేవలందించాలి
‘వైష్ణవి’ ప్రారంభోత్సవంలో మంత్రి చందూలాల్ కాజీపేట : అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు లో ఉండే ధరలతో నాణ్యమైన సేవలందిస్తే వ్యాపారంలో రాణించడంతో పాటు గుర్తింపు పొందొచ్చని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. కాజీపేట ఫాతిమానగర్‌లోని ఫాతిమా కాంప్లెక్స్‌లో బైరి రవికృష్ణ, హరికృష్ణ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ‘హోటల్ వైష్ణవి గ్రాండ్’ రెస్టారెంట్‌ను మంత్రి సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్, గ్రేటర్ మేయర్ నన్నపునేని నరేందర్‌తో కలిసి రెస్టారెంట్‌ను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ వరంగల్ స్మార్ట్‌సిటీగా ఎదుగుతున్న తరుణంలో అత్యున్నత ప్రమాణాలతో రెస్టారెంట్ ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. మేయర్ నరేందర్ మాట్లాడుతూ ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటిస్తే వ్యాపారం సజావుగా సాగుతుందన్నా రు. ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ రెస్టారెంట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ది వెంకటనారయణ, జిల్లా అధ్యక్షుడు బోనగాని యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
ములుగును జిల్లా చేయండి
మంత్రివర్గ ఉప సంఘానికి చందూలాల్ వినతి ములుగు : అభివృద్ధిలో వెనుకబడి, జిల్లాకు అన్ని అర్హతలు ఉన్న ములుగు డివిజన్ కేంద్రాన్ని సమ్మక్క–సారలమ్మ జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి అజ్మీర చందూలాల్, ఎంపీ అజ్మీర సీతారాంనాయక్ ఆదివారం మంత్రివర్గ ఉప సంఘానికి వినతిపత్రం అందించారు. డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహుముద్ అలీ, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జీతేందర్రెడ్డిలకు స్థానిక సౌకర్యాలపై జూబ్లిహిల్స్‌లోని ఎంసీహెచ్ఆర్డీ భవనంలో మంత్రి చందూలాల్ వివరించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ఈ విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించాలని సూచించారు. జిల్లా ఏర్పాౖటెతే వెనుకబడిన గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రెండు రాష్ట్రాలను కలుపుతూ జాతీయ రహదారి, గోదావరి పరివాహక ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, సుమారు 4వేల ఎకరాల ప్రభుత్వ భూములు, పరిశ్రమలు నెలకొల్పడానికి ముడి సరుకులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మంత్రి వెంట జడ్పీ ఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్, మండల అధ్యక్షుడు గట్టు మహేందర్, పీఏసీఎస్ చైర్మెన్ గుగులోతు కిషన్, ఎంపీటీసీ లింగంపల్లి సంపత్‌రావు, నాయకులు బండారి మోహన్‌కుమార్, గట్ల శ్రీనివాస్‌రెడ్డి, గజ్జి నగేశ్, ఎండీ ఖాసీం, గొర్రె సమ్మయ్య, ఏరువ పూర్ణచందర్ ఉన్నారు. -
మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్న రెండో ఏఎన్ఎంలు
కాటారం : కాటారం మండల కేంద్రంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెండో ఏఎన్ఎంలు శుక్రవారం మంత్రి చందూలాల్ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. మేడిపల్లి ఆశ్రమ పాఠశాలలో నూతన భవన సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి మహదేవపూర్ పయనమయ్యారు. మార్గమధ్యంలో మండల కేంద్రానికి వస్తున్నారని తెలుసుకున్న రెండో ఏఎన్ఎంలు ప్రధాన కూడలి వద్ద రాస్తారోకో చేపట్టి మంత్రి కాన్వయ్‌ని అడ్డుకున్నారు. ఇది గమనించిన మంత్రి వాహనం దిగి వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇలా నిరసన తెలపడం సబబుకాదని సూచించారు. గత పది రోజులుగా దీక్ష చేస్తున్నా తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని రెండో ఏఎన్ఎంలు మంత్రితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని మంత్రి ఏఎన్ఎంలకు హామీ ఇచ్చారు.