ట్రేడ్ ఫేర్‌లో డిజిటల్ తెలంగాణ పెవిలియన్
- ప్రారంభించనున్న మంత్రి చందూలాల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సోమవారం ప్రారంభకానున్న భారత-అంతర్జాతీయ ట్రేడ్ ఫేర్‌లో తెలంగాణ రాష్ట్రం ‘డిజిటల్ తెలంగాణ’ పేరుతో పెవిలియన్‌ను ఏర్పాటు చేయనుంది. టీ-హబ్‌తోపాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాట్లు చేయనున్నారు.
ఇన్నోవేషన్, ఇంక్యూబేషన్, స్టార్టప్ ఐటీ అనే మూడు అంశాలు డిజిటల్ తెలంగాణ త్రీడీ డిజైన్‌లో ప్రముఖంగా కనిపించున్నాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పురోభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రపంచ స్థాయి సంస్థలు తెలంగాణలో ఏర్పాటు కావడం, వాటికి కల్పిస్తున్న సదుపాయాలను తెలిపేవిధంగా పెవిలియన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా రాష్ట్ర చేనేతాభివృద్ధి సంస్థ, హస్తకళలు, పాడి పరిశ్రమల అభివృద్ధి సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ తదితర విభాగాలు తమ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. వీటిని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ప్రారంభించనున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఫేర్‌లో 21వ తేదీన ఒగ్గు డోలు, పేరిణి నృత్యం, ఖవ్వాలీ, కొమ్ము కోయ వంటి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైవిధ్యతను ప్రదర్శించనున్నారు.