గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మాట్లాడుకుందాం రమ్మంటూ నమ్మకంగా హోటల్‌కు పిలిచి భార్యను హత్య చేసిన ఘటన గవర్నర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచికచర్లకు చెందిన షారోన్ పరిమళకు 2015లో అదే మండలం వేములపల్లి గ్రామానికి చెందిన ఉప్పెల ప్రసాదరావుతో వివాహమైంది. కొంత కాలం వీరి దాంపత్యం సక్రమంగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ప్రసాద్‌రావు తరచూ ఆమెను అనుమానించడం, అక్రమ సంబంధాలు అంటకట్టడం, మానసికంగా, శారీరంగా వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు.
చదవండి: తల్లి మరణించిందని తెలియక.. రోజూ స్కూల్‌కు వెళ్లొచ్చిన బాలుడు
ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టారు. తనను బాగా చూసుకుంటానని పెద్దలకు చెప్పి కాపురానికి తీసుకెళ్లాడు. కొద్ది రోజుల తర్వాత యధావిధిగా వేధింపులు ప్రారంభించాడు. ఈ విషయమై షారోన్ పరిమళ గతేడాది అక్టోబర్ నెలలో కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై పోలీసులు 498 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆమె విజయవాడలోని ఓ ఆసుపత్రిలో పని చేస్తోంది. ప్రసాద్‌రావు ఆ తర్వాత దుబాయి వెళ్లి ఈ ఏడాది జనవరిలో తిరిగి వచ్చాడు.
హోటల్ గదిలో హత్య...
ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో తాము భార్యాభర్తలమని చెప్పి ప్రసాదరావు, షారోన్ పరిమళ విజయవాడ బస్టాండ్ సమీపంలోని అశోక హోటల్‌లో రూం తీసుకున్నారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో జ్యూస్ తేవడానికి అని చెప్పి ప్రసాదరావు బయటకు వెళ్లి తిరిగి వచ్చాడు. ఆ వెంటనే భార్యకు జ్యూస్ నచ్చలేదని చెప్పి అతను మళ్లీ బయటకు వెళ్లిపోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో హోటల్ రిసెప్షనిస్ట్‌గా పని చేస్తున్న కె.సుధాకర్‌రెడ్డి ప్రసాదరావుకు ఫోన్ చేశాడు. వెంటనే వస్తానని ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి ఉదయం 5.30 గంటల సమయంలో వారు తీసుకున్న 402 నంబరు గదిలోకి వెళ్లాడు.
బెడ్‌పై కప్పి ఉంచిన దుప్పటి తొలగించి చూడగా మెడపై గాయంతో మహిళ రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే గవర్నర్‌పేట సీఐకు సమాచారం అందించారు. జ్యూస్ కోసమని చెప్పి వెళ్లిన ప్రసాదరావు అదే రోజు రాత్రి 3 గంటల ప్రాంతంలో కంచికచర్ల పోలీసుల ఎదుట లొంగిపోయారు. హోటల్‌లో తన భార్య షారోన్‌ను హత్య చేసినట్లు చెప్పడంతో వారు హోటల్‌కు, గవర్నర్ పేట పోలీసులకు సమాచారం అందించారు. రిసెప్షనిస్ట్ ఇచ్చిన ఫిర్యాదుపై గవర్నర్ పేట పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కేసు విషయం మాట్లాడుకుందాం రమ్మంటూ పిలిచి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన...
కంచికచర్ల: విజయవాడలోని హోటల్ గదిలో హత్యకు గురైన మహిళ బంధువులు, కుటుంబసభ్యులు కంచకచర్ల పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. నిందితుడిని, అతడి తల్లిందడ్రులు కుటుంబసభ్యులను అరెస్ట్ చేసి, విచారిస్తున్నామని, ఆందోళన వద్దని పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment