ప్రతీకాత్మక చిత్రం
సారంగపూర్(నిర్మల్): నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని మహబూబాఘాట్స్ వద్ద గల శేక్‌సాహెబ్ దర్గా ఎదుట ఈ నెల 13న అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన కేసును ఎట్టకేలకూ పోలీసులు చేధించారు. డీఎస్పీ ఉపేంద్రరెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని యాకర్‌పెల్లి గ్రామానికి చెందిన శంకర్‌కు అనసూయ, లక్ష్మీ ఇద్దరు భార్యలు. మొదటి భార్య అనసూయకు ఇద్దరు, రెండోభార్య లక్ష్మికి ఒక్కరు సంతానం. ప్రియదర్శినీ నగర్‌లో ఉన్న ఇంటి విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
దీంతో విసిగిపోయిన అనసూయ పదేళ్లక్రితం పుట్టిళ్లు అయిన మండలంలోని ప్యారమూర్‌కు వెళ్లింది. నాలుగేళ్ల క్రితం తమ ఇంటి పక్కనే మరో ఇంటికి పెయింటింగ్ వేయడానికి వచ్చిన బాగుల వాడకు చెందిన దాసరి శివతో లక్ష్మీకి పరిచయం ఏర్పడింది. అనుమానం వచ్చిన శంకర్‌కు తరచూ ఈవిషయంపై లక్ష్మిని వేధిస్తుండేవాడు. పథకం ప్రకారం శంకర్‌ను చంపాలని నిర్ణయించుకుంది. దీనికి శివ సహాయం కోరింది. ఇందుకు ప్రతిఫలంగా రూ.50వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. అడ్వాన్సుగా రూ.5వేలు ఇచ్చింది. ఈ నెల 12న రాత్రి 9గంటలకు ఆటో నడిపి ఇంటికి వచ్చిన శంకర్‌కు శివతో కలిసి మద్యం సేవించాడు.
అనంతరం ఇంట్లోంచి వెళ్లిపోయిన శివ అర్ధరాత్రి మళ్లీ వచ్చాడు. శంకర్ చాతిపై కూర్చుని రెండు చేతులూ పట్టుకుని కదలకుండా కూర్చున్నాడు. అరవడంతో లక్ష్మీ దిండుతో తలపై నొక్కి పట్టింది. ఆ తర్వాత శివ కత్తితో శంకర్ మెడపై పొడిచి గొంతు నులిమి హత్య చేశాడు. లక్ష్మీ తమ్ముడు ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా(టి) గ్రామానికి చెందిన అంగవార్ చింటు అలియాస్ శ్రీనివాస్‌కు జరిగిన విషయం ఫోన్‌లో చెప్పింది.
వెంటనే అక్కడికి చేరుకున్న చింటు సాయంతో మృతదేహాన్ని మహబూబాఘాట్స్ తరలించారు. అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించేందుకు మృతదేహంపై ఆటోను పడేశారు. అద్దాలు పగుల గొట్టి అక్కడినుంచి వెళ్లిపోయారు. పూర్తి విచారణ చేపట్టిన రూరల్ సీఐ వెంకటేష్, ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి 48గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment