మృతిచెందిన చిన్నారులు కృప, శ్రేష్ట (ఫైల్)
సాక్షి, వికారాబాద్ అర్బన్: నవమాసాలు మోసి ఇద్దరు బంగారు తల్లులను కన్న ఓ తల్లి.. చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. కొనఊపిరితో మృత్యుఒడి నుంచి బయటపడిన ఆమె తన కంటి పాపలను మాత్రం కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. ధారూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మిని నాలుగేళ్ల క్రితం బంట్వారం గ్రామానికి చెందిన ఆమె మేనబావ గోపాల్‌కు ఇచ్చి పెద్దలు వివాహం చేశారు. ఏడాది పాటు బంట్వారంలో ఉన్న దంపతులు ఆ తర్వాత వికారాబాద్ వచ్చి ఎన్నెపల్లిలో కాపురం పెట్టారు. వీరికి కృప(2), శ్రేష్ట( 9 నెలల) పాపలు ఉన్నారు. భాగ్యలక్ష్మి రెండేళ్లుగా పట్టణంలోని మహవీర్ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.
భర్త గోపాల్ మాత్రం మద్యానికి బానిసై ఏపనీ లేకుండా తిరుగుతున్నాడు. అంతేకాకుండా భాగ్యలక్ష్మిని వేధిస్తూ.. ఇంట్లో ఉన్న డబ్బులు దొంగిలించడం, బలవంతంగా లాక్కోవడం వంటివి చేస్తున్నాడు. ఇవ్వకపోతే దాడికి పాల్పడుతున్నాడు. నిత్యం ఈ నకరాన్ని భరించలేకపోయిన భాగ్యలక్ష్మి.. జీవితంపై విరక్తి చెందింది. ఈ క్రమంలో శుక్రవారం తన ఇద్దరు పిల్లలను తీసుకుని పట్టణ సమీపంలోని శివారెడ్డిపేట్ చెరువు వద్దకు వెళ్లి అందులో దూకింది. అంతకు ముందు తన ఇద్దరు పిల్లలతో శివారెడ్డిపేట్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని తన వాట్సప్‌లో స్టేటస్ పెట్టుకుంది. ఇది గమనించి కొందరు సన్నిహితులు అక్కడకు వెళ్లేసరికి అప్పటికే తల్లీకూతుళ్లు చెరువు పడిపోయారు. స్థానికులు వీరిని రక్షించే ప్రయత్నం చేయగా భాగ్యలక్ష్మి కొన ఊరిపితో బయటపడింది.
ఇద్దరు చిన్నారుల ప్రాణాలు మాత్రం చెరువులో కలిసిపోయాయి. పోలీసులు, స్థానికులు చెరువులో దిగి గాలించగా ముందు పెద్ద పాప కృప శవమై కనిపించింది. అనంతరం గంట తర్వాత చిన్న పాప శ్రేష్ట మృతదేహం లభించింది. ప్రాణాలతో బయటపడ్డ తల్లికి వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చిన్నారుల మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. సంఘటన స్థలానికి వెళ్లిన డీఎస్పీ సంజీవరావు.. భాగ్యలక్ష్మి భర్త గోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. భాగ్యలక్ష్మి తండ్రి ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ, సీఐ రాజశేఖర్ తెలిపారు. భర్త గోపాల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment