సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాష్ట్ర మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో బాధిత యువతి అజ్ఞాతంలో ఉంటూ వీడియోల ద్వారా తన వాదనలను వినిపిస్తోంది. తనకేదైనా అయి చనిపోతే అందుకు రమేశ్ జార్కిహొళిదే బాధ్యతని స్పష్టంచేసింది. శనివారం నాలుగో వీడియో విడుదల చేసింది. ‘బతుకుతానో చస్తానో తెలీదు. మీడియాకు ఒక్క విషయం చెప్పదల్చుకున్నాను. ఏదైనా సమాచారం లభిస్తే నిజానిజాలను పరిగణనలోకి తీసుకుని ప్రసారం చేయండి. మార్చి 2న రాసలీలల సీడీని ఎవరు విడుదల చేశారో నాకు తెలీదు. మీడియాలో రావడం చూసి నరేశ్ అన్న(విలేకరి)కి ఫోన్ కాల్ చేశాను’అని ఆమె వీడియోలో పేర్కొంది. కాంగ్రెస్ ముఖ్య నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో మాట్లాడాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని నరేశ్ సూచించినట్లు తెలిపింది. శివకుమార్‌ను కలవాలని ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరన్నారు.
రమేశ్ సర్కార్‌ను కూల్చుతానన్నాడు
రమేశ్ జార్కిహోళి ఎంత ఖర్చు అయినా పర్వాలేదని, ఒక్కరోజులో ప్రభుత్వాన్ని కూల్చుతానని, అందరిని జైలుకు పంపిస్తానని వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన మాటలకు అర్థమేమిటని అమ్మాయి ప్రశ్నించింది. తాను భద్రంగానే ఉన్నానని, కిడ్నాప్‌కు గురి కాలేదని, తన కుటుంబ సభ్యులను బెంగళూరుకు తీసుకెళ్లి రక్షణ కల్పించాలని మనవి చేసింది. ఒక బాధితురాలిగా తనకు న్యాయం జరగాలని, కానీ రేపటి రోజున తనను చంపినా చంపుతారని ఆందోళన వ్యక్తం చేసింది. తనను విపరీతంగా వేధింపులకు గురిచేస్తున్నారని, ఒకవేళ తాను చనిపోతే రమేశ్ జార్కిహొళి పేరు రాసిపెట్టి చనిపోతానని పేర్కొంది. అజ్ఞాతంలో ఉన్న బాధిత యువతి శనివారం రాత్రి కొత్తగా ఐదో వీడియోను విడుదల చేసింది. ‘నా తండ్రికి ఏమి తెలియదు, వారిని బెదిరించి బ్లాక్‌మెయిల్ చేసి వారి నోటి వెంట ఏవేవో మాట్లాడిస్తున్నారు’ అని పేర్కొంది.
ఇదంతా ఆయన వల్లనే..
ఆడపిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని రాసలీలల సీడీ కేసులో బాధిత యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. శనివారం బెంగళూరులో నాలుగు గంటల పాటు సిట్ విచారణలో పాల్గొన్న అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తన కుమార్తెను ఒత్తిడితో ఇరికిస్తున్నారని ఆరోపించారు. మా కుమార్తెకు ఏమైనా జరిగితే దానికి డీకే శివకుమార్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తమ కుమార్తెకు డబ్బులిచ్చి గోవాకు తరలించారని ఆరోపించారు. తన అక్కను అడ్డం పెట్టుకుని డీకే శివకుమార్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని యువతి సోదరుడు తెలిపారు.
నాకు సంబంధం లేదు: డీకే
వారి ఆరోపణలపై డీకే శివకుమార్ స్పందిస్తూ ‘అది వారి వ్యక్తిగత విషయం. నాకు దానికి సంబంధం లేదు. నిన్న ఒక్క మాట మాట్లాడుతున్నారు.. రేపు మరో మాట మాట్లాడుతారు’ అన్నారు. పాపం రమేశ్ జార్కిహొళి ఒత్తిడిలో ఉన్నారు. ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. నా దగ్గరికి ఏ యువతీ రాలేదు అని చెప్పారు. ప్రభుత్వంలో ఉండేది బీజేపీ వారే కావడంతో ఎలాంటి చర్యలు తీసుకున్నా నేను సిద్ధం అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment