
మృతి చెందిన చిన్న నాగరాజు (ఫైల్)
బేతంచెర్ల: నచ్చిన యువతితో కుటుంబీకులు పెళ్లి చేయలేదని ఓ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నంద్యాల రైల్వే ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల మేరకు.. బేతంచెర్ల పట్టణం హనుమాన్ నగర్ కాలనీకి చెందిన వడ్డె సుబ్బరాయుడు, మల్లేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరిలో రెండవ కుమారుడు చిన్న నాగరాజు(22) ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం గౌండ పనితో పాటు కారు డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. మూడు నెలల క్రితం ఈ యువకుడికి ఓ పెళ్లి సంబంధం చూశారు.
కాని కుటుంబ సభ్యులు ఆ సంబంధం వద్దని చెప్పారు. దీంతో నచ్చిన యువతితో పెళ్లి చేయడం లేదని మనస్తాపం చెందిన చిన్న నాగరాజు గురువారం అర్ధరాత్రి స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులు, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు నంద్యాల రైల్వే ఎస్‌ఐ నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు కారణాలు తెలుసుకున్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment