రాజేంద్రనగర్: సహజీవనం చేస్తున్న మహిళను రెండు రోజుల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఏమైందో తెలియదు కానీ కాబోయే భార్యకు ఫోన్ చేసి ‘తనను బాగానే అర్థం చేసుకున్నావని.. మంచిగానే చూసుకుంటున్నావని.. కానీ నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ’ ఫోన్ చేసి ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి కడప జిల్లాకు చెందిన విజయ్‌కుమార్(40) కొండాపూర్ రైల్వే స్టేషన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి 15 ఏళ్ల క్రితం ప్రశాంతి అనే మహిళతో వివాహం జరిగింది.
ఒక కుమారుడు పుట్టిన అనంతరం భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో వేరుగా ఉంటున్నారు. ఎనిమిదేళ్ల క్రితం టపాచబుత్ర ప్రాంతానికి చెందిన మంజుప్రియతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఏడాదిగా విజయ్‌కుమార్, మంజుప్రియ సహజీవనం చేస్తున్నారు. ఉప్పర్‌పల్లిలోని కె.ఎన్.ఆర్ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వివాహం చేసుకోవాలని మంజుప్రియ ఒత్తిడి తేవడంతో ఈ నెల 25న ఇరువురు పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించిన పత్రికలను సైతం బంధువులకు అందజేశారు. గత వారం విజయ్‌కుమార్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి కనిపించకుండా పోయాడు.
దీంతో మంజుప్రియ టపాచబుత్ర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు ఆదివారం రాజేంద్రనగర్ పీఎస్‌కు కేసును బదులాయించారు. ఎస్సై శ్వేత ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఉదయం విజయ్‌కుమార్, మంజుప్రియ స్టేషన్‌కు వచ్చి తాము 25న వివాహం చేసుకుంటున్నామని కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీంతో వారికి చట్ట ప్రకారం నోటీసు ఇచ్చి వివరాలను నమోదు చేసుకున్నారు. సోమవారం ఉదయం మంజుప్రియ పెళ్లి షాపింగ్ కోసం తన సోదరితో కలిసి బయటికి వెళ్లింది. విజయ్‌కుమార్ సైతం తాను కూడా కొద్దిసేపట్లో షాపింగ్‌కు వెళతానని చెప్పి ఇంట్లోనే ఉన్నాడు.
రెండు గంటల తర్వాత మంజుప్రియకు ఫోన్ చేసిన విజయ్‌కుమార్ తనను బాగానే అర్థం చేసుకున్నావని, బాగానే చూసుకుంటున్నావని చెబుతూ తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో ఆందోళనకు గురైన మంజుప్రియ అతడితో ఫోన్‌లో మాట్లాడుతూనే ఇంటికి బయలుదేరింది. కొద్ది దూరం రాగానే విజయ్‌కుమార్ సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. హుటాహుటిన ఇంటికి వచ్చిన మంజుప్రియ లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో స్థానికులు, రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించింది.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే విజయ్‌కుమార్ మృతి చెంది ఉన్నాడు. దీంతో మంజుప్రియ తాను బతికి ఏమి ప్రయోజనం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. పోలీసులు ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఖైరతాబాద్ పట్టాల వద్ద ఉన్నట్లు గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విజయ్‌కుమార్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతికి సంబంధించి∙పూర్తి వివరాలు తెలియలేదని పోలీసులు వెల్లడించారు. మొదటి భార్యకు సంబంధించిన విడాకుల కేసు కోర్టులో ఉన్నట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: వివాహిత మహిళతో యువకుడి సహజీవనం.. కన్న కొడుకుని తీసుకెళ్లి..)
Comments
Please login to add a commentAdd a comment