
సుభాష్ ( ఫైల్ ఫోటో )
సాక్షి,చిత్తూరు (కురబలకోట): అక్కా! అమ్మా..నాన్నను బాగా చూసుకో..–ఇదీ ఆత్మహత్యకు ముందు ఓ వ్యక్తి తన సోదరికి పంపిన సందేశం. రైల్వే పోలీసుల కథనం..మదనపల్లెలోని బయ్యారెడ్డి కాలనీకి చెందిన చిన్న వెంకట్రమణ కుమారుడు ఆర్.సుభాష్(27) డెహ్రాడూన్‌లోని సోలార్ ప్లాంట్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న అతని తల్లి లక్ష్మీదేవి (53) బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వ్యాధి ముదిరిందని అక్కడి డాక్టర్లు చెప్పారు. బుధవారం మళ్లీ బెంగళూరుకు తల్లిని తీసుకెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో డెహ్రాడూన్ నుంచి సుభాష్ విమానంలో సోమవారం రాత్రి బెంగళూరు చేరారు. మదనపల్లె బస్టాండు చేరుకుని రాత్రి కడప బస్సు ఎక్కాడు.
గుర్రంకొండకు టికెట్ తీసుకుని మార్గమధ్యంలోని కురబలకోట రైల్వేగేటు వద్ద దిగేశాడు. మంగళవారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో తన అక్క శాంభవికి ఫోన్ చేశాడు. తాను కురబలకోట రైల్వేస్టేషన్ వద్ద ఉన్నానని అమ్మా..నాన్నను బాగా చూసుకోమని చెప్పాడు. ఆ తర్వాత ఉదయం చూస్తే రైల్వే గేటుకు సమీపంలో రైలు పట్టాలపై శవమై కన్పించాడు. తొలుత గుర్తు తెలియని శవంగా భావించారు. సంఘటన స్థలంలో లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా మృతుడిని గుర్తించారు.రైలు ఇతనిపై వెళ్లడంతో తల మొండెం వేరైంది.
ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవని, తల్లికి కాన్సర్ నయం కాదన్న మనోవేదనతో ఇలా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని మృతుని కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా డెహ్రాడూన్‌లో ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment