ధర్మసాగర్: ఆన్‌లైన్ గేమ్‌లో బెట్టింగ్ పెట్టి మోసపోయిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్ పరిధి కాజీపేట మండలం రాంపూర్ శివారులో సోమవారం జరగగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం మల్లక్‌పల్లి గ్రామానికి చెందిన పెసరు రామకృష్ణారెడ్డి (26) రెండేళ్లుగా హనుమకొండలో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు.
ఈ కమ్రంలో ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ బెట్టింగ్ కట్టి దాదాపు రూ.లక్ష వరకు నష్టపోయాడు. అతడికి మళ్లీ ఓ గేమ్ లింక్ రావడంతో ఆ గేమ్‌లో దాదాపు రూ.6లక్షలకుపైగా క్యాష్ ,క్రెడిట్‌కార్డుల ద్వారా పెట్టాడు. ఆన్‌లైన్ గేమ్‌ల మూలంగా సంపాదించిన డబ్బుతోపాటు అప్పులు కూడా చేసి నష్టపోయాడు. అప్పటినుంచి మానసికంగా కుంగిపోయి స్వగ్రామంలోనే ఉంటున్నాడు.
ఈ క్రమంలో సోమవారం ఇంట్లోనుంచి బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అతని సోదరుడు రాజేందర్‌రెడ్డి గ్రామంలో వెతుకుతూ ఉండగా రాంపూర్ శివారులో పురుగుల మందు తాగి ఆపస్మారక స్థితిలో ఉన్నాడని తెలుసుకున్నారు. వెంటనే ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాజేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ధర్మసాగర్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment