ఒక్క బీడీ కోసం ఇద్దరి మధ్య జరిగిన గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. దేశరాజధాని ఢిల్లీలోని షాహ్‌దరా ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. కస్తూర్బా నగర్‌కు చెందిన సన్నీ(20) గురువారం జ్వాలానగర్‌కు చెందిన రాజేశ్ శ్మశానవాటిక సమీపంలో కలుసుకున్నారు. ఆ సమయంలో సన్నీ బీడీ ఇవ్వాలని రాజేశ్‌ను కోరాడు. ఈ విషయం ఇద్దరి మధ్యా వాగ్వాదానికి దారి తీసింది. తీవ్ర కోపోద్రిక్తుడైన రాజేశ్ పెద్ద బండరాయితో సన్నీ తలపై మోదాడు. దీంతో, సన్నీ అక్కడికక్కడే నేలకూలడంతో రాజేశ్ పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి చూడగా సన్నీ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. సన్నీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు, పరారీలో ఉన్న రాజేశ్‌ను శుక్రవారం పట్టుకున్నారు. విచారణలో అతడు నేరం అంగీకరించా డని పోలీసులు తెలిపారు. కాగా, సన్నీ మైనర్‌గా ఉన్నప్పుడే హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని, అతడిపై ఆయుధాల చట్టం కేసు కూడా ఉందని వివరించారు.
కశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోపొర్ ప్రాంతంలోని పానీపొరాలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న బలగాలు గురువారం రాత్రి నుంచి కార్డన్‌సెర్చ్ కొనసాగిస్తున్నాయి. అధికారులు ముందుగా ఆ ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. శుక్రవారం ఉదయం భద్రతాబలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు మృతి చెందారు. మృతుల వివరాలు, వారు ఏ ఉగ్ర సంస్థకు చెందిన వారో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. బిజాపూర్ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్ పరిధి రేఖపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్‌పీఎఫ్ బలగాలు గాలింపు చేపట్టాయి. శుక్రవారం ఉదయం రేఖపల్లి–కోమటపల్లి అటవీ ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులు కాల్పులకు దిగడంతో పోలీసులు సైతం కాల్పులు జరిపారు. గంట పాటు హోరాహోరీగా సాగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి ఒక ఎస్‌ఎల్‌ఆర్, ఒక స్నైపర్ తుపాకీ, ఒక 12 బోర్ రైఫిల్, ఒక మజిల్ లోడింగ్ రైఫిల్, గ్రెనేడ్ లాంచర్ తూటాలు, మందుగుండు సామగ్రి స్వాదీనం చేసుకున్నారు.
చదవండి: కోట్లలో కట్నం.. ఆరంకెల జీతం.. అత్తింటి వేధింపులతో కోడలి ఆత్మహత్య?
Comments
Please login to add a commentAdd a comment