![Young Woman Commits Suicide 3 Months after Marriage in Vizianagaram - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/17/02.jpg.webp?itok=eKbXiahD)
మెజిస్టీరియల్ దర్యాప్తు చేస్తున్న తహసీల్దార్ సుధాకర్, ఎస్సై నరేష్
సాక్షి, విజయనగరం(బాడంగి): ప్రేమను పండించుకుని భవిష్యత్తుపై కోటి ఆశలతో ప్రియుడినే పెళ్లి చేసుకున్న ఓ యువతి పెళ్లయిన మూడునెలలకే బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గజరాయునివలస గ్రామానికి చెందిన పాచిపెంట స్వాతి(25) బుధవారం కన్నవారింటి వద్ద పురుగు మందు తాగి అపస్మాకర స్థితికి చేరుకోగా కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చికిత్స చేస్తుండగా మృతి చెందింది. గ్రామంలో రెండున్నరేళ్లుగా వలంటీర్‌గా పనిచేస్తున్న ఆమెకు మూడునెలల క్రితం సాలూరులో బ్యాంకులో మెసెంజర్‌గా కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న బోగి చాణక్యతో ప్రేమవివాహం జరిగింది.
స్వాతి వలంటీర్‌గా పనిచేస్తుండడంతో భర్త అప్పుడప్పుడు అత్తవారింటికి వచ్చి వెళ్తుంటాడు. ఇంతలో ఏమైందో కానీ ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి పాచిపెంట వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై ఎ.నరేష్ కేసు నమోదుచేశారు. ఈ ఫిర్యాదుపై తహసీల్దార్ కె.సుధాకర్ మెజిస్టీరియల్ దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా మృతురాలి తల్లిదండ్రులు, భర్త బంధువులను ప్రశ్నించారు. కుమార్తె ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలు లేవని ఫిర్యాదులో తల్లి పేర్కొనడంతో పంచాయతీ పెద్దలసమక్షంలో ఆస్పత్రి దగ్గరే శవపంచనామా చేసి పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. వలంటీర్ స్వాతి మృతితో తోటి వలంటీర్లు గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు.
చదవండి: (ఆ బెంగతో ఏకంగా ప్రాణాలే తీసుకుంది)
అప్పుల బాధతో మరొకరు..
గజపతినగరం: గజపతినగరం మండలం పురిటి పెంట న్యూకాలనీలో నివాసం ఉంటున్న కర్రి అప్పారావు (49) తాను నివాసం ఉంటున్న గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం జరిగిన ఈ సంఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్రి అప్పారావు మొదటి భార్య చని పోగా రెండవ భార్య రమాదేవితో కాపురం సాగిస్తున్నాడు. అప్పారావు, రెండో భార్య రమాదేవి నిత్యం గొడవలు పడుతూ ఉండేవారని దీనికి ప్రధానకారణం ఆర్థిక భారం, కుటుంబ కలహాలేనని చెబుతున్నారు. మొదటి భార్యకు ఇద్దరు అబ్బాయిలు కాగా రెండో భార్యకు ఐదేళ్ల పాప ఉంది. వారంతా పక్కపక్కనే ఉండడంతో, నిత్యం కుటుంబకలహాలు, ఆర్థిక భారం తట్టుకోలేక అప్పారావు మనస్తాపం చెంది సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గంగరాజు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment