
ప్రవళిక (ఫైల్ ఫోటో)
కట్నం కారణంగా తండ్రికి బరువవుతానుకుని తనువు చాలించింది ఓ యువతి.. పెళ్లికి తన తండ్రి చేస్తున్న అప్పులు చూడలేక.. తను లేకపోతే రూ.లక్షల్లో అప్పుల బాధ తండ్రికి ఉండదని భావించి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సదాశివనగర్ మండలం భూంపల్లిలో నిశ్చితార్థమైన మరుసటి రోజే బలవన్మరణానికి పాల్పడిన ఘటన వివరాలివి..
సాక్షి, సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని భూంపల్లి గ్రామంలో ఓ యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై జగడం నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం భూంపల్లి గ్రామానికి చెందిన వాగుమారి ప్రవళిక(26)కు తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. ఈనెల 3న భూంపల్లి గ్రామంలో నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి వరకట్నం కింద రూ.8లక్షల నగదు, నాలుగు గుంటల భూమి ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. నా పెళ్లి కోసం ఇంత ఖర్చు పెట్టి ఎందుకు పెళ్లి చేస్తున్నారని, అసలే మీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని పలుమార్లు తల్లిదండ్రులతో చెప్పుకుంటూ యువతి బాధపడేది.
పెళ్లి కోసం ఎక్కువ వరకట్నం ఇస్తున్నారని మనస్తాపం చెంది గ్రామ సమీపంలో బావిలో పడి శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. బావిలో దూకడానికి ముందు ‘నన్ను వెతకకండి.. నేను బావిలో పడి చనిపోతున్నా..’ అని చిన్న బావ సంజీవరావ్‌కు ఫోన్ చేసి చెప్పింది. సంజీవ్‌రావ్ వెంటనే కుటుంబీకులకు విషయం తెలిపి బావి వద్దకు వెళ్లి పాతాలగరిగెతో వెతకగా శవం బయటపడింది. మృతదేహాన్ని చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. పెళ్లి కోసం ఆర్థిక భారం ఎక్కువ అవుతుందనే మనస్తాపంతో గాజు బావిలో దూకి మృతి చెందినట్లు ఈ సందర్భంగా ఎస్సై తెలిపారు. చందర్‌రావ్‌కు ముగ్గురు కూతుళ్లు కాగా ఇద్దరి కూతుళ్ల పెళ్లిళ్లు చేశాడు. మూడో కూతురు ప్రవళిక. మృతురాలి తండ్రి చందర్‌రావ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: (అమెరికాలో చిత్తూరు జిల్లా మహిళ మృతి)
Comments
Please login to add a commentAdd a comment