ఎంత కర్కశం: తోబుట్టువులనే కనికరం లేకుండా.. | Younger Brother Who Assassination The Elder Brother And Sister | Sakshi
Sakshi News home page

‘అణు’మాత్రం కనికరం లేకుండా.. 

Published Mon, Mar 8 2021 10:41 AM | Last Updated on Tue, Mar 9 2021 4:50 PM

Younger Brother Who Assassination The Elder Brother And Sister  - Sakshi

మృతి చెందిన సన్యాసిరావు, జయమ్మ      

ఆస్తిపై పెంచుకున్న మమకారం ఆప్తులపై లేకుండా పోయింది. రూ.5 లక్షల డబ్బుపై  పెరిగిన ప్రేమ రక్తం పంచుకు పుట్టిన అన్న, అక్కలపై ద్వేషానికి కారణమైంది. పరిహారం విషయంలో తలెత్తిన స్ఫర్థ ఓ కుటుంబంలో దారుణ హత్యలకు దారి తీసింది. తలకెక్కిన దురాశ విచక్షణను కోల్పోయేలా చేసింది. రణస్థలం మండలం రామచంద్రాపురం గ్రామంలో ఓ వ్యక్తి సొంత అన్న, అక్కలనే హత్య చేశాడు. కేవలం ఆస్తిలో వాటా డబ్బు కోసం తోబుట్టువులను కర్కశంగా నరికి మట్టు పెట్టాడు.  

రణస్థలం (శ్రీకాకుళం): కొవ్వాడ మత్స్యలేశం పంచాయతీలో గల రామచంద్రాపురం గ్రామంలో గొర్లె సన్యాసిరావు (54), అక్క జయమ్మ(50)లు ఆదివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. సొంత తమ్ముడు రామకృష్ణ వీరి పాలిట కాలయముడయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జేఆర్‌ పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 

కర్కశంగా దాడి..
గ్రామంలో ఉదయం 5.45 గంటల సమయంలో గొర్లె సన్యాసిరావు తన ఇంటి వ ద్ద ఆవు పాలు పితుకుతుండగా.. వెనక నుంచి వచ్చిన రామకృష్ణ కత్తిలో బలంగా అతడి తలపై వేటు వేశాడు. ఆ తర్వాత కూడా మెడ, ఇతర భాగాలపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. బాధతో అతను అరుస్తుంటే.. లోపల నుంచి అక్క జయమ్మ బయటకు వచ్చి చూసి నిశ్చేష్టురాలైంది. దివ్యాంగురాలైన ఆమె వచ్చి ప్రతిఘటించగా రామకృష్ణ ఆమెపైనా దాడికి దిగా డు. శరీరమంతా కత్తితో గాయాలు చేయడంతో అక్కడికక్కడే చనిపోయింది. చుట్టుపక్కల వారు చూసి వచ్చే సరికి నిందితుడు అక్కడి నుంచి పారిపోయా డు. సన్యాసిరావును ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా కొద్ది దూరం వెళ్లే సరికే ప్రాణాలు వదిలేశాడు. దీనిపై సమాచారం అందుకున్న శ్రీకాకుళం డీఎస్పీ ఎం.మహీంద్ర, సీఐ వి.చంద్రశేఖర్‌లు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఘటన జరిగిన రెండు గంటల తర్వాత నిందితుడు రామకృష్ణ జేఆర్‌ పురం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. జేఆర్‌ పురం ఎస్‌ఐ కె.వాసునారాయణ మృతదేహాలను శవ పంచనామాకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వారసత్వ ఇంటితోనే వివాదం..  
రామచంద్రాపురంలో సన్యాసిరావు కుటుంబానికి ఆస్తులు ఉన్నాయి. సన్యాసిరావు ఇద్దరు అక్కలు అవివాహితులు కావడంతో వారు అన్నతోనే ఉంటున్నారు. రామకృష్ణ తన కుటుంబంతో వేరేగా ఉంటున్నారు. కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం నిర్మాణంలో భాగంగా ఊరి వారికి పరిహారాలు చెల్లిస్తున్నారు. పరిహారాల పంపిణీలో భాగంగా వీరికి పంపకాలు జరిగిపోయాయి. అయితే అవివాహితులైన మహిళలు ఇంతకు ముందు ఓ పెంకుటింట్లో ఉండేవారు. ఆ ఇంటికి కూడా రూ.16 లక్షల వరకు పరిహారం వచ్చింది. ఆ డబ్బులో తనకు వాటా కావాలని రామకృష్ణ పంచాయతీ పెట్టాడు. ఆడవాళ్ల సొమ్ము మనకు వద్దని సన్యాసిరావు సర్ది చెప్పినా వినలేదు.

తన వాటాగా రూ.5 లక్షలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీనిపై తోబుట్టువుల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. శనివారం రాత్రి కూడా దీనిపై వాదోపవాదాలు జరిగాయి. ఆఖరకు రామకృష్ణకు రూ.5లక్షలు ఇవ్వడానికి సన్యాసిరావు, అక్కలు ఒప్పుకున్నారు. అయితే ఇకపై తమతో ఆర్థిక లావాదేవీలేవీ పెట్టుకోకూడదని, తమను ఏ విషయంలోనూ వేధించకూడదని పెద్ద మనుషుల సమక్షంలో రాత పూర్వకంగా ఒప్పుకోవాలనే డిమాండ్‌ పెట్టారు. ఈ డిమాండ్‌ విషయంలో రామకృష్ణ కోపోద్రిక్తుడయ్యాడు. తానెందుకు సంతకం పెట్టాలంటూ గొడవ పెట్టుకున్నాడు. తెల్లవారే సరికి ఆ కోపంతోనే అన్న, అక్కలపై దాడి చేసి హతమార్చాడని స్థానికులు చెబుతున్నారు.   

ముగ్గురు కూతుళ్ల భవిష్యత్‌ ఏంటి..? 
సన్యాసిరావుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు మే 26న పెళ్లి చేసేందుకు ముహూర్తం కూడా తీశారు. అంతలోనే ఈ దుర్ఘటన జరిగింది. మరోవైపు నిందితుడు రామకృష్ణ తన కూతురికి ఓ పోలీసు అధికారితో వివాహం చేయడం గమనార్హం. సన్యాసిరావు మృతితో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు.
చదవండి:
నగ్న వీడియోలు: వ్యాపారవేత్తను ఇంటికి పిలిచి..
‘అప్పు తీరుస్తారా.. బిడ్డను అమ్ముతారా..?’

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement