సాక్షి, సిటీబ్యూరో : అత్యవసర సమయాల్లో వినియోగించే మెఫన్ టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్‌ను నగర యువత స్టెరాయిడ్‌గా వినియోగిస్తోంది. జిమ్‌ల్లో ఎక్కువ సమయం గడిపి, కండలు పెంచడానికి ఈ సూది మందు తీసుకుంటోంది. ఈ ఇంజక్షన్‌ను అక్రమంగా యువతకు విక్రయిస్తున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి, వారి నుంచి రూ.1.5 లక్షలు విలువైన 130 మెఫన్‌టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి శనివారం వెల్లడించారు.
►చంద్రాయణగుట్ట పరిధిలోని అల్ జూబ్లీ కాలనీకి చెందిన మహ్మద్ షా ఫహద్ గతంలో ఓ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి వివిధ రకాలైన ఔషధాలు, వాటిలో స్టెరాయిడ్స్‌గా ఉపకరించే వాటిపై పట్టుంది. ఇతడికి మెఫన్‌టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్ ఉత్ప్రేరకంగా పని చేస్తుందని, దీన్ని యువత ఎక్కువగా వాడతారని తెలిసింది.
►రోగులకు సర్జరీలు చేసే సమయంలో మత్తు (అనస్తీషియా) ఇస్తారు. ఈ ఇంజక్షన్ రక్తపోటును అవసరమైన స్థాయిలో పెంచి, గుండె పక్కాగా పని చేయడానికి ఉపకరిస్తుంది. అలాగే గుండెపోటు వచ్చిన వారికీ వైద్యం కోసం ఈ ఇంజక్షన్‌ను వాడతారు.
►ఈ ఇంజక్షన్‌ను రోగికి ఇవ్వడం ద్వారా అతడి నరాలు పూర్తిస్థాయిలో తెరుచుకునేలా చేయవచ్చు. దీంతో రక్త ప్రసరణ సక్రమంగా జరిగి ముప్పు తప్పే ఆస్కారం ఉంటుంది. అయితే కాలక్రమంగా ఈ ఇంజక్షన్‌ను అథ్లెట్స్ స్టెరాయిడ్‌గా వాడటం మొదలెట్టారు.
►నగరంలో జిమ్‌లకు వెళ్తున్న యువత నిర్ణీత బరువు కంటే ఎక్కువ వెయిట్స్ ఎత్తడానికి, ఎక్కువ సమయం వ్యాయామం చేయడానికి స్టెరాయిడ్‌గా మెఫన్‌టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్ వాడుతున్నారు. నిబంధనల ప్రకారం వైద్యుడి ప్రిస్కిప్షన్ లేనిదే ఈ ఇంజక్షన్ విక్రయించేందుకు వీలులేదు.
►కొందరు అక్రమార్కులు వీటిని జిమ్‌లకు వెళ్లే యువతకు అక్రమంగా, ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. ఈ విషయం గుర్తించిన ఫహద్ చాదర్‌ఘాట్‌కు చెందిన షేక్ అబ్దుల్ ఓవైసీతో జట్టు కట్టాడు. వీరిద్దరూ ఢిల్లీకి చెందిన అక్షయ్ ఎంటర్‌ప్రైజెస్ అనే మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు విక్రమ్ సాయంతో ఈ ఇంజక్షన్లు ఖరీదు చేస్తున్నారు.
►అక్కడి నుంచి కొరియర్‌లో సిటీకి తెప్పించి జిమ్‌లకు వెళ్లే యువతకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, వి.నరేందర్, మహ్మద్ థక్రుద్దీన్‌లతో దాడి చేసి ఇద్దరు నిందితుల్ని పట్టుకున్నారు.
►150 ఇంజక్షన్లను వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించారు. మెఫన్‌టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్ స్టెరాయిడ్‌గా వాడటం వల్ల అనేక దుష్ఫరిణామాలు ఉంటా యని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment