
సాక్షి,సింహాచలం(విశాఖపట్నం): ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం అడవివరంలో చోటుచేసుకుంది. గోపాలపట్నం ఏఎస్‌ఐ అప్పలకొండ తెలిపిన వివరాలివీ.. అడవివరంలోని సంతోషిమాత గుడి వీధిలో నివాసం ఉంటున్న తంగేటి త్రినాథ్ (19) ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటాడు. గురువారం రాత్రి ఇంట్లో భోజనం చేసి పడుకున్నాడు. అతడి తల్లి మంగలక్ష్మి కూలి పనులు చేస్తుంటుంది.
శుక్రవారం ఉదయం 6 గంటలకే మంగలక్ష్మి పనుల నిమిత్తం వెళ్లింది. ఉదయం తొమ్మిది గంటలైనా త్రినాథ్ నిద్రలేవకపోవడంతో చుట్టుపక్కన వాళ్లు తలుపులు కొట్టారు. ఎంతకీ త్రినాథ్ తలుపులు తీయకపోవడంతో.. కిటికీ నుంచి చూడగా ఉరి వేసుకుని ఉన్నాడు. వెంటనే సమాచారాన్ని అతని తల్లికి, పోలీసులకు అందించారు. గోపాలపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ప్రేమ వ్యవహారాల కారణంగానే త్రినాథ్ మృతి చెందినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
చదవండి: షాక్‌లో బడా వ్యాపార వేత్త: అటు కుమార్తె పెళ్లి, ఇటు స్టార్ హోటల్‌లో భారీ చోరీ