రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌కు వినతిపత్రం ఇస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
సాక్షి, అమరావతి: తిరుపతి పుణ్యక్షేత్రంలో భక్తులను భయభ్రాంతులకు గురిచేసి, ఓటర్లకు ఆందోళన కలిగించేలా చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుపైన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలపైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి శనివారం ఫిర్యాదు చేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే టీడీపీ.. తన అనుకూల మీడియాతో కలసి కొత్త డ్రామా ఆడిందని ఫిర్యాదులో వైఎస్సార్‌సీపీ పేర్కొంది. దైవ దర్శనానికి వచ్చే భక్తులను దొంగ ఓటర్లుగా చిత్రీకరించే ప్రయత్నం దుర్మార్గమంది.
తిరుపతిపైనే టీడీపీ దృష్టి ఎందుకు?
‘‘తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కానీ కేవలం తిరుపతినే టీడీపీ లక్ష్యంగా ఎంచుకుంది. బస్సుల్లో వైఎస్సార్‌సీపీ నేతలు దొంగ ఓటర్లను తరలిస్తున్నారంటూ... టీడీపీ, ఇతర పార్టీలు నానా రభస చేశాయి. పథకం ప్రకారం చంద్రబాబు అనుకూల మీడియా రంగంలోకి దిగి భక్తులను భయపెట్టేలా ప్రవర్తించింది. రకరకాలుగా అవమానపర్చేలా ప్రశ్నలతో వేధించారు. చంద్రబాబు అనుకూల మీడియా తమ చానళ్లలో పదేపదే ప్రసారం చేయడం, టీడీపీ దీన్ని రాద్ధాంతం చేయడం షరా మామూలుగా జరిగింది. తిరుపతి పుణ్యక్షేత్రమైనందున ప్రతి రోజూ 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వస్తుంటారు. ఇతర నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఈ కారణంగానే తిరుపతిని తమ పథకానికి కేంద్రంగా ఎంచుకుని, భక్తుల మనోభావాలతో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఆడుకోవడం క్షమించరాని నేరం. తిరుపతి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమైన చర్య.
పక్కా ప్రణాళికతో టీడీపీ హైడ్రామా..
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక చర్యలు చేపట్టింది. అదనపు బలగాలను దించింది. కేంద్ర పరిశీలకులను ఏర్పాటు చేసింది. ఇదిగాక ప్రతీ పార్టీ నుంచి పోలింగ్ బూత్‌ల్లో ఏజెంట్లు ఉంటారు. ఓటరును గుర్తించిన తర్వాతే ఓటు వేయనిస్తారు. కానీ దొంగ ఓట్లు వేయించేందుకే బస్సుల్లో ఇతరులను తరలిస్తున్నారంటూ చంద్రబాబు ఆదేశాల మేరకు అసత్య ప్రచారం చేశారు. ఇది వైఎస్సార్‌సీపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీడీపీ పన్నిన కుట్ర. పక్కా ప్రణాళికతో హైడ్రామా ఆడారు. పోలింగ్ సరళిని దెబ్బకొట్టే దుశ్చర్యలకు పాల్పడ్డారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి, ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి’’ అని లేఖలో వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా, తిరుపతి లోక్‌సభ ఎన్నిక సందర్భంగా భక్తులను కించపర్చేలా వ్యవహరించిన టీడీపీ నేతలపై చర్య తీసుకోవాలని కోరుతూ శనివారం ఉదయం లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర ముఖ్యనేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ ఈ వ్యవహారానికి పాత్రధారులని అందులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment