బెంగళూరు: అనేక మలుపులు తిరిగిన జొమాటో డెలివరీ బాయ్- బెంగళూరు యువతి వివాదం కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకనందున దర్యాప్తును తాత్కాలికంగా నిలిపేశారు. ఈ మేరకు విచారణాధికారి జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘‘ఈ ఘటనలో సాక్షాధారాలు సేకరించేందుకు మేం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. తనపై దాడి జరిగిందని ఆ యువతి సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. డెలివరీ బాయ్ కూడా ఆమె మీద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను విచారించేందుకు సిద్ధంకాగా ఆమె అందుబాటులో లేకుండా పోయారు.
ఇద్దరూ పరస్పర కేసులు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఉంటే, అసలు అక్కడ ఏం జరిగింది అన్న విషయం తెలిసేది. కానీ అక్కడ సీసీ కెమెరా లేదు. కేవలం యువతి ఆరోపణల ఆధారంగా ముందుకు వెళ్లలేం’’అని పేర్కొన్నారు. ఇక మరో పోలీసు ఉన్నతాధికారి స్పందిస్తూ.. ‘‘జొమాటో డెలివరీ బాయ్ కామరాజ్ తనపై పిడిగుద్దులు కురిపించాడని ఆరోపించిన హితేషా చంద్రాణిని విచారణకు రమ్మని ఆదేశించగా, తాను మహారాష్ట్రకు వెళ్తున్నట్లు చెప్పారు. తన ఆంటీని కలిసేందుకు పొరుగు రాష్ట్రం వెళ్తున్నట్లు తెలిపారు. ఆ మరుసటి రోజు ఆమె సిటీ వదిలి పరారైనట్లు మీడియాలో వార్తలు రాగా, తానెక్కడికీ వెళ్లలేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇక ఆమె బంధువులు, హితేష చంద్రాణికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, తను ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అసలు ఆమె ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు ఫోన్ నెట్‌వర్క్ లొకేషన్‌ను ట్రేస్ చేస్తున్నాం. అంతేకాదు, ఆమె చికిత్స పొందిన ఆస్పత్రి నుంచి నివేదిక కోరాం. ఆమె ముక్కుకు ఎలా గాయమైందో అన్న అంశంపై తుది నివేదిక వచ్చిన తర్వాత దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లే యోచనలో ఉన్నాం’’ అని తెలిపారు.
కాగా ఆర్డర్ ఆలస్యమైనందుకు ప్రశ్నించినందుకు, జొమాటో డెలివరీ బాయ్ తనపై దాడి చేశాడంటూ హితేషా చంద్రాణి అనే యువతి ఓ వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే, యువతి ఫిర్యాదు మేరకు డెలివరీ బాయ్‌ను అరెస్టు చేయగా, బెయిలుపై విడుదలయ్యాడు. ఇక ఇప్పుడు అతడి ఫిర్యాదు నేపథ్యంలో హితేషను విచారించేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆమె హాజరు కావడం లేదు. దీంతో, ప్రాథమిక కేసు విచారణను సైతం తాత్కాలికంగా వాయిదా వేయడంతో హితేషకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
చదవండి: వైరల్ పోస్ట్: జొమాటో రియాక్షన్
Comments
Please login to add a commentAdd a comment