భూసేకరణకు రాష్ట్ర వాటా రూ.50 కోట్లు మంజూరు
నాలుగేళ్లలో రూ.1,409 కోట్లు మంజూరు
ఎంపీ చింతా అనురాధ
అల్లవరం: రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కోటిపల్లి –నరసాపురం రైల్వే లైన్ నిర్మాణంపై నిర్లక్ష్యం వహించారని, లోక్‌సభలో టీడీపీ ఎంపీలు కోటిపల్లి రైల్వే లైన్ ఆవశ్యకతను వివరించి నిధులు తేవడంలో విఫలమయ్యారని అమలాపురం ఎంపీ చింతా అనురాధ తెలిపారు. అల్లవరం మండలం మొగళ్ళమూరులోని ఆమె నివాసంలో కోటిపల్లి రైల్వేలైన్ పురోగతిపై గురువారం ఎంపీ అనురాధ మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రూ.1,409 కోట్లు నిధులు విడుదల చేసిందన్నారు. కోటిపల్లి–శానపల్లిలంక, బోడసకుర్రు– పాశర్లపూడి, చించినాడ–నరసాపురం నదులపై రైల్వే లైన్ వంతెనలు పిల్లర్లు నిర్మాణంలో చివరి దశలో ఉన్నాయన్నారు.
నదులపై నిర్మాణంలో ఉన్న వంతెనలకు గడ్డర్ల ఏర్పాటుకు రైల్వే శాఖ టెండర్లు ప్రక్రియను పూర్తి చేసిందని, త్వరలో పనులు ప్రారంభించనున్నారని తెలిపారు. అమలాపురం నుంచి చించినాడ వరకు రైల్వే లైన్ భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలే రూ.50 కోట్లు విడుదల చేశారని ఎంపీ అన్నారు. రాష్ట్ర వాటాగా ఒక రూపాయి కుడా ఎందుకు విడుదల చేయలేకపోయారో చంద్రబాబు, ఆయన ఎంపీలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేసిన రూ.50 కోట్ల నిధులతో భూసేకరణ వేగవంతమైందని తెలిపారు. రైల్వే లైన్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని, కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించడంలో కీలక భూమిక పోషిస్తున్నారని తెలిపారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తాను ఎంపీగా పార్లమెంట్‌లో కోటిపల్లి–నరసాపురం రైల్వేలైన్ ప్రాముఖ్యతను వివరిస్తూ అధిక నిధులు కేటాయింపులు చేయించానన్నారు. తాను ఎంపీగా మొత్తంగా రూ.1,409 కోట్లు రైల్వే లైన్ నిర్మాణం కోసం నిధుల కేటాయింపులు జరిగాయన్నారు. కేంద్ర బడ్జెట్‌లో కోటిపల్లి–నరసాపురం రైల్వే ప్రాజెక్టుకు రూ.300 కోట్లు, కాకినాడ నుంచి కోటిపల్లి వరకు రైల్వే ట్రాక్ మరమ్మతులకు రూ.10 కోట్లు, భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.50 కోట్లు విడుదల చేస్తే కోటిపల్లి రైల్వే లైన్‌పై చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
ఇప్పటికై నా నిజాలు తెలుసుకొని, కోటిపల్లి రైల్వే లైన్‌పై చంద్రబాబు రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. మే 13 న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణా స్వీకారం చేస్తారని, సీఎం జగన్ నేతృత్వంలోనే కోటిపల్లి–నరసాపురం రైలు పట్టాలు ఎక్కుతుందని, కోనసీమ జిల్లా ప్రజల చిరకాల కోరిక తీరుతుందని ఎంపీ అనురాధ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment