రాష్ట్ర పండగగా ప్రభల తీర్థం
ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్న అర్చకులు, నిర్వాహకులు
అంబాజీపేట: మండలంలోని జగ్గన్నతోటలో ఏటా సంక్రాంతికి నిర్వహించే ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండగగా గుర్తించాలని ఏకాదశ రుద్రాలయాల అర్చకులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆయా ఆలయాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబునాయుడుకు లేఖ రాసినట్టు నిర్వాహకులు తెలిపారు. 450 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రభల ఉత్సవాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని వారు కోరారు.
వ్యాఘ్రేశ్వరం (బాలాత్రిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వర స్వామి), కె.పెదపూడి (పార్వతీ సమేత మేనకేశ్వర స్వామి), ఇరుసుమండ (బాలాత్రిపుర సుందరి సమేత ఆనందరామేశ్వర స్వామి), వక్కలంక (అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి), నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి), ముక్కామల (బాలాత్రిపురసుందరీ సమేత రాఘవేశ్వర స్వామి), మొసలపల్లి (బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి), పాలగుమ్మి (శ్యామలాంబా సమేత చెన్నమల్లేశ్వర స్వామి), గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత వీరేశ్వర స్వామి), గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి), పుల్లేటికుర్రు (బాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు) జగ్గన్నతోటలో కనుమ రోజున కొలువుదీరుతారు. ఈ తీర్థానికి జాతీయస్థాయి గుర్తింపు రావడంతో 2020లో ఈ ఉత్సవానికి సంబంధించి ఏకాదశ రుద్రుల ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివకేశవ యూత్ సభ్యులకు లేఖ రాశారు.
అలాగే శృంగేరి పీఠాధిపతులు మరొక లేఖను పంపించారు. రెండేళ్ల క్రితం శివకేశవ యూత్ సభ్యులు, ప్రభల నిర్వాహకులు జగన్నతోట ప్రభల తీర్ధ విశిష్టతను కేంద్ర, రాష్ట్రాలకు లేఖ ద్వారా వివరించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆంధ్రప్రదేశ్ తరఫున ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలలో ప్రభలతీర్థాన్ని కళాజాతను ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఏకాదశ రుద్ర ఆలయాలకు నిధులు మంజూరు చేసి ఈ తీర్థాన్ని రాష్ట్ర పండగగా గుర్తించాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment