
ఇంటర్ పరీక్షలకు 892 మంది గైర్హాజరు
అమలాపురం టౌన్: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జనరల్, ఒకేషనల్ పరీక్షలు గురువారం జరిగాయి. ఆయా పరీక్షలకు మొత్తం 892 మంది గైర్హాజరయ్యారు. జనరల్ పరీక్షలకు మొత్తం 11,722 మందికి 11,263 మంది విద్యార్థులు హాజరై, పరీక్షలు రాశారు. 459 మంది పరీక్షలకు హాజరు కాలేదు. అలాగే ఒకేషనల్‌లో 2,458 మందికి 2,025 మంది హాజరయ్యారు. మొత్తం 433 మంది గైర్హాజరయ్యారు. డీఐఈవో వనుము సోమశేఖరరావు అమలాపురంలోని ఎస్‌కేబీఆర్, ఆదిత్య, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
టెన్త్ విద్యార్థులకు
ఉచిత బస్సు ప్రయాణం
అమలాపురం రూరల్: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజా రవాణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బస్సు పాస్ లేకపోయినా, వారి హాల్ టికెట్ ఆధారంగా జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు ఉచిత ప్రయాణం చేయవచ్చని వివరించారు. కోనసీమ జిల్లా పరిధిలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
కూటమి తీరుపై
ఇది జనం తిరుగుబాటు
● ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే..
● మాజీ ఎంపీ చింతా అనురాధ
అల్లవరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పది నెలలు గడవక మునుపే పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైందని మాజీ ఎంపీ చింతా అనురాధ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పేదల సంక్షేమం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం రద్దు చేస్తూ, లబ్ధిదారులు, విద్యార్థులు, యువత భవిష్యత్తును నాశనం చేస్తోందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన రూ.4,600 కోట్ల బకాయిలను తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ నిరుద్యోగులకు ప్రకటించిన నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరించి, వైద్య విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. యువతకు, విద్యార్థులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన యువత పోరు కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టామని, ఇది సర్కార్‌పై తిరుగుబాటని తెలిపారు. యువత పోరును విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
15న జెడ్పీ సమావేశం
కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం, బడ్జెట్ సమావేశం ఈ నెల 15న నిర్వహించనున్నారు. జిల్లా పరిషత్ సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు విధిగా హాజరు కావాలని కోరారు.
భావనారాయణ స్వామికి
రూ.8.53 లక్షల ఆదాయం
కాకినాడ రూరల్: సర్పవరంలోని రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి ఆలయంలో గురువారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. సీఎఫ్‌ఓ గ్రేడ్–1 ఈఓ వీరభద్రరావు పర్యవేక్షణలో గ్రామస్తులు, అర్చకులు, సిబ్బంది, సేవాదళ్ కార్యకర్తల సమక్షంలో 10 హుండీలు తెరచి, ఆదాయం లెక్కించారు. మొత్తం రూ.8,52,983 ఆదాయం లభించిందని ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. నగదు రూపంలో రూ.7,53,512, నాణేలుగా రూ.99,471 వచ్చాయన్నారు.

ఇంటర్ పరీక్షలకు 892 మంది గైర్హాజరు

ఇంటర్ పరీక్షలకు 892 మంది గైర్హాజరు
Comments
Please login to add a commentAdd a comment