రామాయణాన్ని తెలుగులో సరళతరం చేసిన మొల్ల
– జాయింట్ కలెక్టర్ నిషాంతి నివాళి
అమలాపురం రూరల్: విజయనగర సామ్రాజ్యానికి చెందిన ప్రముఖ కవులు, ఆస్థాన పండితుల సమక్షంలో, సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణాన్ని సులభతరంగా తెలుగులోకి అనువదించి కవయిత్రి మొల్ల ప్రశంసలు అందుకున్నారని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి కొనియాడారు. కవయిత్రి మొల్ల జయంత్యుత్సవాల సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లో కవయిత్రి మొల్లమాంబ చిత్రపటానికి ఆమె నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ, ప్రముఖ కవయిత్రి ఆత్మకూరి మొల్లమాంబ(మొల్ల) జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణాన్ని తేనె లొలికే అచ్చ తెలుగులో రచించిన ఖ్యాతి మహా కవయిత్రి మొల్లమాంబకే దక్కుతుందన్నారు. తొలి తెలుగు కవయిత్రిగా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని మొల్ల పదిలపర్చుకుందన్నారు. రామాయణాన్ని మహా పండితులు అనేక మంది రచించినప్పటికీ, మొల్ల రామాయణానికి విశిష్ట స్థానం ఉందన్నారు. మహా పండితులు సైతం మొల్ల రామాయణాన్ని ప్రామాణికంగా చూపుతుంటారన్నారు. ఎంతో భక్తిభావం, ఆరాధనతో మొల్ల రచించిన రామాయణానికి ప్రత్యేక శైలి ఉందన్నారు. మొల్ల రామాయణం రచించి ఆమె శ్రీకృష్ణదేవరాయలు సన్మానం అందుకుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ రాజకుమారి, డీఈవో షేక్ సలీం బాషా, దేవదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రమేష్, ఏఓ కాశీవిశ్వేశ్వరరావు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment