పటిష్టంగా పది పరీక్షల నిర్వహణ
– జాయింట్ కలెక్టర్ నిషాంతి
అమలాపురం రూరల్: జిల్లాలో ఈ నెల 17 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. గురువారం పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఆమె సమీక్షించారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరూ మొబైల్ ఫోన్‌ను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో సెక్షన్–144 విధించాలని చెప్పారు. జిరాక్సు, నెట్ సెంటర్లు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలన్నారు. వైద్య శిబిరాలు, సామగ్రి అందుబాటులో ఉంచాలన్నారు. ప్రశ్నా, జవాబుపత్రాల తరలింపులో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించి, పరీక్షా కేంద్రాల రూట్లలో సర్వీసులు నడపాలని ఆదేశించారు. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించామన్నారు. సమస్యాత్మకమైన పసలపూడి, మొగలికుదురు, కొత్తపేట పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 19,217 మంది విద్యార్థులకు 110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డీఈవో షేక్ సలీం బాషా, పరీక్షల కంట్రోలింగ్ అధికారి హనుమంతరావు, డీఆర్‌ఓ రాజకుమారి, అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం సేకరణకు సర్వ సన్నద్ధం
ప్రస్తుత రబీ సీజన్‌లో ధాన్యం సేకరణకు సర్వ సన్నద్ధం కావాలని జేసీ నిషాంతి అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ సౌరబ్ గౌర్, మేనేజింగ్ డైరెక్టర్ జిలానీ వివిధ జిల్లాల జేసీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. ధాన్యం సేకరణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment